శివాజీ డేర్‌!... హోదాపై మోదీ హామీల సీడీ రిలీజ్‌!

Update: 2018-04-14 08:33 GMT

ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం అంద‌రికంటే ముందుగా ఉద్య‌మం చేప‌ట్టిన సినీ హీరో శివాజీ... దాదాపుగా అన్ని రీతుల్లో ఉద్య‌మం కొన‌సాగించారు. ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌కు కూడా దిగారు. న‌డుముల్లోతు నీటిలో నిల‌బ‌డి జ‌ల ఉద్య‌మం చేప‌ట్టారు. అయితే ఆమ‌ర‌ణ దీక్ష సంద‌ర్భంగా ఏపీ ప్ర‌భుత్వం ఆయ‌న దీక్ష‌ను భ‌గ్నం చేసిన త‌ర్వాత చాలా కాలం పాటు ఆయ‌న క‌నిపించ‌కుండానే పోయారు. అయితే మొన్న‌టి కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేంద్రం అన్యాయం చేసిన తీరుతో అన్ని పార్టీలు కూడా మరోమారు ప్రత్యక హోదా ఉద్య‌మాన్ని చేప‌ట్ట‌గా... త‌న‌వంతుగా శివాజీ కూడా మ‌రోమారు ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ప‌లు ప్ర‌జా సంఘాల‌తో క‌లిసి ఉద్య‌మం సాగిస్తున్న శివాజీ నేటి ఉద‌యం విశాఖ కేంద్రంగా కొత్త త‌ర‌హా ఉద్య‌మాన్ని చేప‌ట్టారు.

ఏపీకి ప్ర‌త్యేక హోదాకు సంబందించి బీజేపీ ప్ర‌ధాన‌మంత్రి అభ్య‌ర్థి హోదాలో గ‌డ‌చిన ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా న‌రేంద్ర మోదీ చేసిన వాగ్దానాలు, ఆ త‌ర్వాత ప్ర‌ధాని హోదాలో ఏపీకి ఇచ్చిన హామీల‌ను శివాజీ వెలికి తీశారు. వాటన్నింటినీ ఓ సీడీలో గుదిగుచ్చి ప్ర‌త్యేక సీడీగా రూపొందించేశారు. ఈ సీడీని కాసేప‌టి క్రితం ఆయ‌న విశాఖ‌లో రిలీజ్ చేసేశారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన శివాజీ... ఏపీకి ప్ర‌త్యేక హోదాతో పాటుగా రాజ‌ధాని నిర్మాణం, ఇత‌ర‌త్రా అంశాల్లో ఏ త‌ర‌హా సాయం అంద‌జేస్తామ‌న్న విష‌యాల‌ను మోదీ మాట‌ల్లోనే జ‌నానికి తెలిపేందుకే ఈ సీడీని ఆవిష్క‌రించినట్లు తెలిపారు. ఈ సీడీని నేరుగా మోదీకి కూడా పంపనున్న‌ట్లు ప్ర‌క‌టించిన శివాజీ... క‌నీసం ఈ సీడీతోనైనా... ఏపీకి తానిచ్చిన హామీలు ఇన్ని ఉన్నాయా? అన్న భావ‌న మోదీలో క‌లుగుతుంద‌ని ఆశిస్తున్న‌ట్లుగా చెప్పారు.

ఇక ద‌క్షిణాదిలో పాగా వేసేందుకు ప్రాంతీయ పార్టీల‌ను తుద‌ముట్టించేందుకు బీజేపీ ఆప‌రేష‌న్ గ‌రుడ‌ను ర‌చించింద‌ని మొన్నామ‌ధ్య‌ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన శివాజీ... మ‌రోమారు ఆ అంశాన్ని ప్ర‌స్తావించారు. ఆపరేషన్ గరుడతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో గందరగోళం సృష్టిస్తోందని మండిపడ్డారు. ఇక ప్ర‌త్యేక హోదాపై క‌లిసిక‌ట్టుగా పోరాటం సాగించాల్సిన పార్టీలు దానిని మ‌రిచి... ఒక్కొక్క‌రు ఒక్కో దారిని ఎంచుకున్న వైనాన్ని కూడా శివాజీ త‌ప్పుబ‌ట్టారు. రాజకీయ నేతల్లో అసహనం పెరిగిపోతోందని... అందరూ సంయమనం పాటించాలని కోరారు. రాష్ట్ర హక్కుల కోసం మాట్లాడకుండా... ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం ఆపేయాలని అన్నారు. హోదాపై పోరాటాన్ని తొక్కేయడానికే స్వామీజీల గొడవను తెరపైకి తీసుకొస్తున్నారని ఆయ‌న ఆరోపించారు. మే మొదటి వారంలో మరిన్ని నిజాలను బయటపెడతానని శివాజీ మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

Tags:    

Similar News