దళితబంధుపై హైకోర్టులో పిల్.. చట్టవిరుద్ధమట?

Update: 2021-07-31 06:34 GMT
తెలంగాణ సీఎం కేసీఆర్ ఉప ఎన్నికల వేళ.. హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన ‘దళితబంధు’ పథకాన్ని అడ్డుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ పథకాన్ని అమలు చేయడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో ‘ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖలైంది. జనవాహినీ పార్టీ, జైస్వరాజ్ పార్టీ, తెలంగాణ రిపబ్లిక్ పార్టీల కార్యదర్శులు సంగీత, రత్నమాల, ఆనంద్ లు ఈ పిల్ దాఖలు చేశారు.

ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు టీఆర్ఎస్ పార్టీ ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందని.. ఈ వ్యవహారాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరారు. ఈ పిల్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి, సీఎం కేసీఆర్, కేంద్ర ఎన్నికల కమిషన్, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ తోపాటు కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు.

ఇక మరో పిల్ కూడా హైకోర్టులో దాఖలైంది. రాష్ట్రవ్యాప్తంగా 16 ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలు ఉన్నాయని.. అక్కడ దళితబంధు అమలు చేయకుండా జనరల్ నియోజకవర్గం హుజూరాబాద్ లో అమలు చేయడం చట్టవిరుద్ధమని సామాజిక కార్యకర్త అక్కడ సురేష్ కుమార్ మరో పిల్ దాఖలు చేశారు.

నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి రూ.10 లక్షలు బదిలీ చేస్తామని చెబుతున్న నేపథ్యంలో ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరారు.  ఎస్సీ నియోజకవర్గాల్లో మాత్రమే ఈ పథకాన్ని అమలు చేసేలా ఆదేశించాలని కోరారు. ఈ రెండు పిల్ లు వచ్చేవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.  

-దళితబంధు పథకం తీరు ఇదీ..

దళిత బంధు పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలు జరుగుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. కాళ్లు, రెక్కలు మాత్రమే ఆస్తులుగా కలిగిన దళిత కుటుంబాలే మొదటి ప్రాధాన్యతగా దళిత బంధు పథకం ఉంటుందని అన్నారు. అర్హులైన దళితులందరికీ దళిత బంధు పథకం అమలు చేస్తామని.. దశల వారీగా అమలు చేసే ఈ పథకం కోసం రూ.80వేల కోట్ల నుంచి రూ.1 లక్షల కోట్ల వరకు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా హుజూరాబాద్ లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభమయ్యే ఈ దళిత బంధు కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచి దేశ దళితులందరినీ ఆర్థిక, సామాజిక వివక్షల నుంచి విముక్తులను చేయబోతున్నదని సీఎం తెలిపారు. అందుకు పట్టుదలతో అందరం కలిసి పథకం విజయవంతం అయ్యేందుకు కృషి చేద్దామని.. సంఘాల నేతలకు, దళిత ప్రజాప్రతినిధులకు మేధావులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. 
Tags:    

Similar News