ఈ సార్ పట్టింద‌ల్లా మ‌ట్టే..

Update: 2016-07-19 08:08 GMT
తెలంగాణ‌లో ఒక‌ప్పుడు ఒక వెలుగు వెలిగి ఇప్పుడు వ‌రుస ఎదురుదెబ్బ‌లు తింటున్న నేత ఎవ‌రైనా ఉన్నారంటే అది బీజేపీ నేత నాగం జ‌నార్ద‌న‌రెడ్డే అని చెప్పాలి. రాజ‌కీయంగా ఆయ‌న ఏ స్టెప్పు వేసినా కూడా అది విఫ‌ల‌మ‌వుతూనే ఉంది. చివ‌ర‌కు కోర్టుల్లోనూ ఆయ‌న‌కు మొట్టికాయ‌లే ప‌డుతున్నాయి. తాజాగా తెలంగాణ‌లో సాగునీటి ప్రాజెక్టుల్లో అక్ర‌మాలు జ‌రిగాయంటూ న్యాయ‌స్థానంలో పిటిష‌న్ వేసిన నాగంకు న్యాయస్థానం అక్షింత‌లు వేసింది.

పాల‌మూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా కాంట్రాక్టుల అప్ప‌గించారంటూ కోర్టుకెళ్లిన  నాగం పిటిష‌న్‌ ను కోర్టు కొట్టివేసింది. ఇటీవ‌ల ఈప్రాజెక్టులో అక్ర‌మాలు జ‌రిగాయి అనేందుకు అద‌న‌పు స‌మాచారం దొరికిందంటూ ఆయ‌న మ‌రోసారి పిటిష‌న్ వేశారు. దీనిపై కోర్టు తీవ్రంగా మండిప‌డింది. మ‌రోసారి అద‌న‌పు సమాచారం ఉందంటూ తప్పుడూ పిటిష‌న్ వేస్తారా? అని పిటిష‌న్ త‌ర‌ఫు న్యాయ‌వాదిని ప్ర‌శ్నించింది. ఈవిష‌యంలో ఎలాంటి మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇవ్వ‌లేమ‌ని తేల్చి చెప్పింది.  అన‌వ‌స‌రంగా కోర్టు స‌మ‌యం వృథా చేస్తున్నారంటూ కోటింగ్ ఇచ్చింది.

తెలంగాణ రాష్ట్రం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి నాగం ఏం చేసినా కూడా వ‌ర్క‌వుట్ కావ‌డం లేదు. టీడీపీ నుంచి బ‌య‌టికి వ‌చ్చిన ఆయ‌న తొలుత‌ బీజేపీలో చేరారు. అక్క‌డ కిష‌న్ రెడ్డితో ప‌డ‌క ఏడాదిపాటు పార్టీకి దూరంగా ఉన్నాడు. తెలంగాణ బచావో పేరిట ఓ వేదిక పెట్టుకున్నారు. అదీ కూడా న‌డ‌వ‌క‌పోవ‌డంతో చివ‌రికి బీజేపీలోనే కొన‌సాగుతున్నారు. అయితే,, పార్టీ ఆదేశించిందో.. లేకుంటే త‌న వ్య‌క్తిగ‌త ఆస‌క్తో తెలియ‌దుగానీ.. తెలంగాణ స‌ర్కారు అవినీతికి పాల్ప‌డుతోంద‌ని ఎలాగైనా నిరూపించాల‌ని ఆయ‌న కంక‌ణం క‌ట్టుకున్నారు. ఈ క్ర‌మంలో  తొలుత ఎర్ర‌గ‌డ్డ ఆసుప‌త్రి త‌ర‌లింపును వ్య‌తిరేకిస్తూ.. హైకోర్టులో పిటిష‌న్ వేశారు. దాన్ని కోర్టు కొట్టివేసింది. ఇటీవ‌ల పాల‌మూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అక్ర‌మాలు జ‌రుగుతున్నాయంటూ నాగం వేసిన‌ పిల్‌ ను కోర్టు తోసిపుచ్చింది. అద‌న‌పు స‌మాచారం ఉందంటూ అదే పిటిష‌న్‌ ను ఇటీవ‌ల మ‌ళ్లీ వేశారు. ఈసారీ కూడా కోర్టు దాన్నీ తిర‌స్క‌రించింది. మొత్తానికి ఆయ‌న ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టాల‌ని ఎన్ని ఆయుధాలు ప్ర‌యోగించినా.. అవ‌న్నీతుస్సుమంటున్నాయి.
Tags:    

Similar News