రెండు కేసుల్లో ఏపీ సర్కారుకు హైకోర్టు ఆక్షింతలు

Update: 2016-04-21 07:52 GMT
రెండు కేసులకు సంబంధించి ఏపీ సర్కారు తీరును హైకోర్టు తప్పు పట్టింది. లక్షలాది మంది అమాయక ప్రజల జీవితాల్ని ప్రభావితం చేసిన అక్షయ గోల్డ్.. అగ్రిగోల్డ్ కేసులకు సంబంధించి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. ఘాటైన వ్యాఖ్యలు చేసింది. అక్షయ గోల్డ ఉదంతంలో సీరియస్ అయిన హైకోర్టు.. ఈ కేసు నిందితుల్ని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ గా ప్రకటించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసుకు సంబంధించి నిందితుల విషయంలో పోలీసులు కావాలనే సాగదీత ధోరణిని అనుసరిస్తున్నారన్న వ్యాఖ్యను చేసిన కోర్టు.. ఈ కేసులోని నిందితుల ఫోటోల్నిపోస్టర్లుగా వేసి అంటించాలని పేర్కొంది. నిందితుల్ని ఇప్పటివరకూ ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ ప్రశ్నించిన హైకోర్టు.. వారిని వెంటనే ఆరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చాలని ఆదేశించింది. మొత్తంగా ఆక్షయ గోల్డ్ కేసులో ఏపీ సర్కారు వైఖరి పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా చెప్పొచ్చు.

ఇక.. రెండు తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ కేసులోనూ హైకోర్టు ఏపీ సర్కారు తీరును తీవ్రంగా తప్పు పట్టింది. ప్రజల నుంచి వేలాది కోట్ల రూపాయిలు డిపాజిట్లుగా స్వీకరించి.. తిరిగి చెల్లించటంలో విఫలమైన సంస్థపై ఏపీ సర్కారు మెతక వైఖరితో ఎందుకు ఉంటుందని సూటిగా ప్రశ్నించింది.

ఆగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి ఏపీ సర్కారు ఎందుకు అనుమతి ఇవ్వటం లేదని ప్రశ్నించిన న్యాయస్థానం.. ప్రజలకు న్యాయం చేసే విషయంలో ఏపీ సర్కారు ఆలస్యం చేస్తున్నట్లుగా వ్యాఖ్యానించటం గమనార్హం అక్షయ గోల్డ్.. అగ్రిగోల్డ్ కేసులకు సంబంధించి ఏపీ సర్కారు తీరును హైకోర్టు ప్రశ్నించిన తీరు బాబు పాలనా దక్షతపై ప్రశ్నలు రేకెత్తేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News