కేసీఆర్‌ కు హైకోర్టు షాక్‌ ల‌ మీద షాక్‌ లు...

Update: 2019-10-01 15:28 GMT
తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు తెలంగాణ హైకోర్టు షాక్‌ ల మీద షాక్‌ లు ఇచ్చింది. మంగ‌ళ‌వారం కేసీఆర్‌ కు చాలా దుర్ధిన‌మైన రోజుగానే అభివ‌ర్ణించ‌వ‌చ్చు.. ఒక్క విష‌యంలోనే కాకుండా రెండు విష‌యాల్లో తెలంగాణ స‌ర్కారుకు హైకోర్టు షాక్ ఇవ్వ‌డంతో కేసీఆర్ ప‌రేషాన్‌ లో ప‌డ్డారు. ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌ను ప‌ట్టించుకోకుండా - ప‌లు స్వ‌చ్ఛంద సంస్థ‌ల ఆరోప‌ణ‌లు వినిపించుకోకుండా దుందుడుకుగా ముందుకు పోతున్న కేసీఆర్‌ కు హైకోర్టు పెద్ద షాక్ ఇచ్చింద‌నే చెప్ప‌వ‌చ్చు. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన ఈ షాక్ భారీగానే ఉంది. ఇది తెలంగాణ స‌ర్కారు ప‌ని తీరు పైన‌ - అది తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై పెద్ద ప్ర‌తికూల ప్ర‌భావ‌మే ప‌డ‌నున్న‌ది.

సోమ‌వారం నుంచి తెలంగాణ స‌చివాలయంను ఖాళీ చేశారు. పాత స‌చివాలయం  కూల్చివేయాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించి మంత్రులు - హెచ్ ఓ డీల ఆఫీసుల‌ను వివిధ ప్ర‌దేశాల‌కు మార్పు చేశారు. అయితే ఆ స‌చివాల‌యం కూల్చాల‌నే ప్ర‌య‌త్నంలో ఉండ‌గానే హైకోర్టు ఏకంగా స‌చివాల‌యం కూల్చివేయ‌రాదంటూ మంగ‌ళ‌వారం తీర్పు ఇచ్చింది. ఈ కేసును ద‌స‌రా సెల‌వుల త‌రువాత విచార‌ణ చేప‌డుతామ‌ని అప్ప‌టిదాకా కూల్చ‌వ‌ద్దంటూ తెలంగాణ స‌ర్కారును ఆదేశించింది. ఇదే రోజున తెలంగాణ కేబినేట్ స‌మావేశ‌మై స‌చివాలయం కూల్చివేత‌పై కేబినేట్ ఆమోదం తెల‌పాల‌నుకుంది. దీంతో కోర్టు ఆదేశం స‌ర్కారుకు పెద్ద దెబ్బ‌గానే చెప్ప‌వ‌చ్చు.

మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ ఇవ్వొద్దు : హైకోర్టు

ఇక తెలంగాణ స‌ర్కార‌కు ఇప్ప‌టికే స‌చివాల‌యం కూల్చివేత‌పై షాక్ ఇచ్చిన హైకోర్టు  - మున్సిపల్‌ ఎన్నికలపై దాఖలైన పిటిషన్‌ తేలేంత వరకు ఎన్నికల నోటిఫికేషన్‌ ఇవ్వొద్దని హైకోర్టు ఆదేశించింది. గతంలో ఎన్నికల కమిషన్‌ పాటించిన విధానాన్ని పాటించాలని సూచించింది. అలాగే ఎన్నికల ముందు జరిగే ప్రక్రియ మొత్తం పూర్తి చేసుకోవచ్చని తెలిపింది. దసరా సెలవుల తర్వాత దీనిపై విచారణ చేపట్టనున్నట్టు కోర్టు తెలిపింది.

అటు స‌చివాల‌యం కూల్చివేత‌ - ఇటు మున్సిప‌ల్ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌ పై హైకోర్టు తెలంగాణ స‌ర్కారుకు షాక్ ఇవ్వ‌డంతో స‌ర్కారు డిఫెన్స్‌ లో ప‌డింది. అంతే కాకుండా ద‌స‌రా సెల‌వుల నేప‌థ్యంలో అత్య‌వ‌స‌ర కేసుల విచార‌ణ‌కు ఈనెల 9 - 10 తేదీల్లో డివిజ‌న్ బెంచ్‌ - సింగిల్ బెంచ్‌ ల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు, ఈనెల 3 నుంచి 11వ‌ర‌కు కోర్టుకు సెల‌వులు ప్ర‌క‌టించింది హైకోర్టు.




Tags:    

Similar News