థర్డ్ వేవ్ వచ్చేస్తోంది ..కేంద్ర , రాష్ట్ర చ‌ర్య‌ల‌పై హైకోర్టు ఆగ్ర‌హం

Update: 2021-09-08 13:30 GMT
కరోనా థర్డ్ వేవ్ ఆందోళనను రేకెత్తిస్తుంది. సెప్టెంబర్ లేదాంటే అక్టోబర్‌ లో మూడో ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీనితో ప్రభుత్వాలు కూడా అప్రమత్తంగానే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే సెకండ్ వేవ్ తగ్గుతుంది అనుకుంటే, మూడో వేవ్ ముప్పు పంచుకు కూర్చుంది.  అయితే మూడో వేవ్ ముంచుకొస్తోందని, ఇంకా చర్యలు ఎందుకు తీసుకోలేదని తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విచారణ సందర్భంగా థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస రావు కోర్టుకు నివేదిక ఇచ్చారు.

ప్రభుత్వ స్పందనపై తాత్కాలిక చీఫ్ జస్టిస్ ఎం.ఎస్. రామచంద్రరావు, జస్టిస్ టి. వినోద్ కుమార్‌ తో కూడిన ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికలు, ప్రక్రియల కోసం వైరస్ వేచి చూడదని కామెంట్ చేసింది. ఇప్పటికే కరోనా వైరస్ సోకి చాలా మంది చనిపోయారని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకునైనా నష్టం జరగకుండా చూడాలని సూచించింది. చాలా రాష్ట్రాల్లో మూడో వేవ్ సంకేతాలు కనిపిస్తున్నాయని, అక్కడ కేసులు పెరిగిపోతున్నాయని గుర్తు చేసింది.

ఆదేశించినా ఇంతవరకు నిపుణుల కమిటీ సమావేశం నిర్వహించలేదని, వారంలోగా కమిటీ భేటీ అయి ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించింది. జనగామ, కామారెడ్డి, ఖమ్మం, నల్గొండలో కేసుల పాజిటివిటీ రేటు ఒక శాతం కన్నా ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. పిల్లల చికిత్స కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని కోరింది. తమ ఈ ఆదేశాలనైనా అమలు చేయాలని, లేదంటే కోర్టుకు రావాల్సి ఉంటుందని డీహెచ్, కేంద్ర నోడల్ అధికారిని హెచ్చరించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు.

దేశంలో నిన్న కొత్తగా 37,875 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,30,96,718కి చేరింది. అలాగే, నిన్న 39,114 మంది కోలుకున్నార‌ని పేర్కొంది. దేశంలో క‌రోనాతో మ‌రో 369 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,41,411కి పెరిగింది.  ఇక క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,22,64,051 మంది కోలుకున్నారు. 3,91,256 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. దేశంలో నిన్న 78,47,625 డోసుల వ్యాక్సిన్లు వేశారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 70,75,43,018 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. మరోపక్క, నిన్న ఒక్క‌ కేర‌ళ‌లోనే 25,772 కేసులు న‌మోదు కాగా, ఆ రాష్ట్రంలో నిన్న 189 మంది ప్రాణాలు కోల్పోయారు.
Tags:    

Similar News