స‌చివాల‌యం కూల్చివేత‌పై హైకోర్టు రియాక్ష‌న్ ఇదే!

Update: 2019-06-24 11:53 GMT
న‌మ్మ‌కం అనండి.. వాస్తు అనండి.. కార‌ణం ఏమైనా స‌చివాల‌యం తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రికి అస్స‌లు న‌చ్చ‌లేదు. దానికి బ‌దులుగా కొత్త స‌చివాల‌యాన్ని నిర్మించాల‌ని డిసైడ్ అయ్యారు. దీంతో.. ఇప్ప‌టికే ప‌లు ప్ర‌య‌త్నాలు చేసి విఫ‌ల‌మైన ఆయ‌న‌.. తాజాగా ఇప్పుడున్న స‌చివాల‌యాన్ని కూల్చేసి.. ఆ స్థానంలో కొత్త‌ది క‌ట్టాల‌ని డిసైడ్ అయ్యారు.

ఈ నేప‌థ్యంలో స‌చివాల‌యం ఉన్న‌ 25.5 ఎక‌రాల్లో నిర్మించిన‌ భ‌వ‌నాలతో పాటు.. దానికి ప‌క్క‌నే ఉన్న మ‌రిన్ని భ‌వ‌నాల్ని కూల్చేసి.. చ‌తుర‌స్రాకారంతో భూమిని సిద్ధం చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ వ్య‌వ‌హారాన్ని త‌ప్పు ప‌డుతూ తాజాగా తెలంగాణ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. ప్ర‌స్తుతం ఉన్న భ‌వ‌నాల్ని కూల్చేది లేదంటూ తెలంగాణ స‌ర్కారు 2016లో హైకోర్టులో అఫిడ‌విట్ దాఖ‌లు చేసింద‌ని.. ఇప్పుడేమో పాత భ‌వ‌నాల్ని కూల్చివేసి మ‌ళ్లీ కొత్త స‌చివాల‌యం నిర్మిస్తామ‌ని చెప్ప‌టాన‌ని ప్ర‌శ్నించారు.

అప్ప‌ట్లో ప్ర‌భుత్వం చెప్పిన దానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును పిటిష‌న్ దారు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. స‌చివాల‌యాన్ని మొద‌ట్లో ఎర్ర‌గ‌డ్డ ఆసుప‌త్రి ప్రాంతంలో నిర్మించాల‌ని ప్ర‌య‌త్నించారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు టీఆర్ఎస్ చ‌ర్య‌ను త‌ప్పు ప‌ట్టి.. హైకోర్టును ఆశ్రయించారు. ఈ స‌మ‌యంలో స‌చివాల‌యాన్ని త‌ర‌లించ‌మంటూ కోర్టులో అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది కేసీఆర్ స‌ర్కారు.

తాజాగా అందుకు భిన్న‌మైన చ‌ర్య‌ల్ని చేప‌ట్టిన నేప‌థ్యంలో హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. అయితే.. ఈ విష‌యం మీద వాద‌న‌ల్ని శుక్ర‌వారం వింటామ‌ని హైకోర్టు పేర్కొంది. త‌దుప‌రి విచార‌ణ‌ను శుక్ర‌వారానికి వాయిదా వేసింది. మ‌రీ విష‌యంలో హైకోర్టు ఎలా రియాక్ట్ అవుతుందో తేల‌టానికి శుక్ర‌వారం వ‌ర‌కూ వెయిట్ చేయాల్సి ఉంటుంది.
Tags:    

Similar News