రుణమాఫీలో అనర్హులకే లాభమన్న హైకోర్టు

Update: 2015-12-22 04:38 GMT
రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన రుణమాఫీ పథకం సన్న.. చిన్నకారు రైతులకు ఎలాంటి లాభం చేకూర్చలేదంటూ హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలపై వేసిన పలు వ్యాజ్యాల్ని విచారించిన సందర్బంగా రుణమాఫీ అంశంపై ఆసక్తికర వాదనలు చోటు చేసుకున్నాయి. రుణమాఫీతో పెద్ద రైతులకు మాత్రమే తప్పించి.. చిన్న రైతులకు ఎలాంటి లబ్థి చేకూరలేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఒకట్రెండు ఎకరాలున్న రైతులకు పరిహారం అందటం లేదన్న వాదనతో పాటు.. ఆత్మహత్యలు చేసుకుంటున్న వారంతా సన్నకారు రైతులేనన్న విషయాన్ని కోర్టు గుర్తు చేసింది.

ఆత్మహత్యలకు కారణం అప్పులు మాత్రమే కాదు.. మరికొన్ని కారణాలు ఉన్నాయని.. వాటిపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందన్న సూచనపై సానుకూలంగా స్పందించింది. రైతులను ఆదుకునేందుకు వీలుగా రూ.లక్ష వరకు ఉన్న రుణాల్ని మాఫీ చేసేందుకు వీలుగా.. తెలంగాణసర్కారు రూ.17వేల కోట్ల రుణాల్ని మాఫీ చేయటానికి సిద్ధమైందన్న తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదించిన న్యాయవాది వాదనలపై స్పందించిన హైకోర్టు.. రుణమాఫీ కారణంగా ఆత్మహత్యలు ఆగటం లేదన్న విషయాన్ని ప్రస్తావించారు.

ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం ఒక ఉదాహరణను ఉటంకించింది. మహారాష్ట్రలో కూడా రుణమాఫీని అమలు చేస్తున్నారని.. అయితే.. పెద్ద పెద్ద రైతులు మైనర్లు అయిన తమ పిల్లల పేరిట రూ.లక్ష చొప్పున రుణం తీసుకొని రుణమాఫీ లబ్థిని పొందుతున్నారని.. భూస్వాములు ఇంత భారీగా లబ్థి పొందాల్సిన అవససరం ఉందా? అన్న సూటి ప్రశ్నను హైకోర్టు సంధించింది. రుణమాఫీతోనే రైతుల ఆత్మహత్యలకు పరిష్కారం కాదని.. ఈ విషయంపై మరింత లోతుగా అధ్యయనం జరగాల్సిన అవసరం ఉందన్న వాదనను హైకోర్టు సమర్థించి.. ఆ దిశగా ప్రయత్నాలు జరగాలంది. వాస్తవ కోణంలో రైతుల ఆత్మహత్యలపై విచారణ సాగటం ఒక శుభ పరిణామంగా చెప్పాలి. అన్నదాతల ఆత్మహత్యలకు చెక్ పెట్టేలా నిర్ణయాలు తీసుకోగలిగితే అంతకు మించి కావాల్సిందేముంది?

Tags:    

Similar News