రఘురామ బెయిల్ పిటీషన్ ను కొట్టేసిన హైకోర్టు

Update: 2021-05-15 09:30 GMT
వైసీపీ నర్సాపురం రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఏపీ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన వేసిన బెయిల్ పిటీషన్ ను తాజాగా విచారించిన హైకోర్టు కొట్టివేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. వాదనలు పూర్తి కావడంతో బెయిల్ కోసం సెషన్స్ కోర్టుకు వెళ్లాలని రఘురామకు సూచించింది.

ఇక అరెస్ట్ చేసిన ఎంపీని సీఐడీ కోర్టులో హాజరుపరుచాలని సీఐడీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఇక ఎంపీ రఘురామను నేరుగా హైకోర్టుకు రాకుండా కింది కోర్టుకు వెళ్లాలని సూచించింది. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలోని ఆరో అదనపు కోర్టులో రఘురామను సీఐడీ పోలీసులు హాజరుపరుచనున్నారు.

రఘురామను నిన్న అరెస్ట్ చేయగా.. హైకోర్టులో రాత్రి హౌజ్ మోహన్ పిటీషన్ దాఖలు చేశారు. రఘురామ తరుఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. విచారణ లేకుండా ఎంపీ అరెస్ట్ ను ఆయన తప్పుపట్టారు. రఘురామ అరెస్ట్ కు సహేతుక కారణాలు లేవని హైకోర్టుకు వివరించారు.

అయితే దీనిపై జిల్లాకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని న్యాయవాదిని హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. కేసు తీవ్రత దృష్ట్యా హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ఆయన కోర్టుకు తెలిపారు. అయితే జిల్లా కోర్టులోనే బెయిల్ పిటీషన్ దాఖలు చేయాలని హైకోర్టు కొట్టివేసింది.ఏపీ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాడని ఆరోపిస్తూ ఏపీ సీఐడీ పోలీసులు నిన్న ఎంపీ రఘురామను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి ఏపీకి తీసుకొచ్చి విచారిస్తున్నారు.
Tags:    

Similar News