ఆది ఫ్యామిలీ ఆరాచ‌కంతో ఆగ‌మాగం!

Update: 2018-06-04 04:54 GMT
ఏపీ మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి కుటుంబ సృష్టించిన ఆరాచ‌కంతో క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలోని పెద్ద దండ్లూరు గ్రామంలో ఉద్రిక్త వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది. అంత‌కు మించిన భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. కొత్త‌గా పెళ్లి చేసుకున్న దంప‌తుల్ని ఆశీర్వ‌దించేందుకు వైరి ప‌క్షానికి నేత రావ‌టం అధికార‌ప‌క్ష నేత‌ల‌కు అస్స‌లు న‌చ్చ‌లేదు.

వైరి వ‌ర్గం వారు ఊరికి వ‌స్తే త‌మ అధిక్య‌త త‌గ్గిన‌ట్లుగా భావించిన మంత్రి ఆది కుటుంబ స‌భ్యుల వైఖ‌రి అభ్యంత‌ర‌క‌రంగా వ్య‌వ‌హ‌రించారు. త‌మ‌కు వ్య‌తిరేకంగా ఉన్నారంటూ కొన్ని కుటుంబాల మీద దాడి చేసి బీభ‌త్సం సృష్టించారు. ఇంత జ‌రిగినా పోలీసులు మాత్రం చూసి చూడ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది. అస‌లు ఇలా ఎందుకు జ‌రిగిందన్న విష‌యంలోకి వెళితే..

అధికార ప‌క్ష ఆరాచ‌కం అంత‌కంత‌కూ పెరిగిపోతుంద‌న్న విమ‌ర్శ‌కు బ‌ల‌మిచ్చేలా చోటు చేసుకున్న ఈ ఉదంతాన్ని చూస్తే.. క‌డ‌ప జిల్లాలోని జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలోని పెద్ద‌దండ్లూరు గ్రామంలో ఇటీవ‌ల  ఏపీఎస్పీ కానిస్టేబుల్ సంప‌త్ పెళ్లి జ‌రిగింది. వివాహ వేడుక మే 25న జ‌ర‌గ్గా.. దీనికి ఎంపీ అవినాష్ రెడ్డితోపాటు.. మ‌రికొంద‌రు నేత‌ల్ని ఆహ్వానించారు. అయితే.. అవినాష్ రెడ్డి ఢిల్లీలో ఉండ‌టంతో పెళ్లికి వెళ్ల‌టం సాధ్యం కాలేదు.

దీంతో.. తాజాగా ఆయ‌న కొత్త దంప‌తుల్ని పలుక‌రించి.. శుభాకాంక్ష‌లు చెప్పేందుకు బ‌య‌లుదేరారు. ఎంపీ అవినాష్ రెడ్డి గ్రామంలోకి వ‌స్తే త‌మ అధిప‌త్యానికి గండి ప‌డుతుంద‌ని భావించిన ఏపీ మంత్రి ఆది కుటుంబ స‌భ్యులు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించ‌టం హాట్ టాపిక్ గా మారింది. కొంత‌మంది రౌడీ మూక‌ల్ని వెంటేసుకున్న మంత్రి త‌న‌యుడు సుధీర్ రెడ్డి గ్రామంలో వీరంగానికి పాల్ప‌డ్డారు.

త‌మ‌కు తెలీకుండా.. చెప్ప‌కుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌ల్ని ఊళ్లోకి ఎలా ఆహ్వానిస్తారంటూ మండి ప‌డ్డ మంత్రి కుమారుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సానుభూతిప‌రుల ఇళ్ల‌పైనా.. ఆస్తుల పైనా దాడుల‌కు తెగ‌బ‌డ్డారు. ఎంపీని ఆహ్వానించిన సంప‌త్ వారింటికి వెళ్లి.. వారి ఇంటి ముందు వేసి ఉన్న షామియానాను.. ఇంట్లోని ఫ‌ర్నీచ‌ర్‌ ను ధ్వంసం చేశారు.

ఇంత జ‌రుగుతున్నా పోలీసులు ప్రేక్ష‌క పాత్ర పోషించిన‌ట్లుగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.ఇదంతా ఒక ఎత్తు అయితే..  గ్రామంలో ఉద్రిక్త ప‌రిస్థితులు ఉన్నాయంటూ ఎంపీ అవినాష్ రెడ్డి ఆయ‌న అనుచ‌రుల వాహ‌నాల్ని ఊళ్లోకి వెళ్ల‌కుండా పోలీసులు అడ్డుకున్నారు. అంద‌రిని కాకుండా క‌నీసం ముగ్గురిని అయినా ఊళ్లోకి అనుమ‌తించాల‌ని ఎంపీ అవినాష్ రెడ్డి కోర‌గా పోలీసులు అందుకు స‌సేమిరా అన‌టాన్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.

ఎంత అధికార‌ప‌క్షానికి అనుకూలంగా ఉన్నా.. పోలీసులు మ‌రీ ఇంత ఏక‌ప‌క్షంగా ఎలా వ్య‌వ‌హ‌రిస్తారంటూ త‌ప్పు ప‌డుతున్నారు. మంత్రి కుటుంబ‌స‌భ్యులు.. అనుచ‌రులు వీరంగం సృష్టిస్తున్నా పోలీసులకు ప‌ట్ట‌లేద‌ని.. మ‌రోవైపు త‌మ పార్టీ వారిపై జ‌రుగుతున్న దాడుల్ని అడ్డుకునేందుకు వ‌స్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌ల్ని పోలీసులు అడ్డుకోవ‌టం అర్థం లేద‌న్న మాట వినిపిస్తోంది. పోలీసుల తీరును త‌ప్పు ప‌ట్టి ఆందోళ‌న చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌పై పోలీసులు లాఠీచార్జికి పాల్ప‌డ‌టం గ‌మ‌నార్హం.

మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమంటే.. మంత్రి ఆది కుటుంబానికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న పోలీసులు టీడీపీ ఎమ్మెల్సీ.. మంత్రి ఆదికి వైరిప‌క్ష‌మైన రామ‌సుబ్బారెడ్డిని సైతం పోలీసులు అడ్డుకున్నారు. త‌మ అనుచ‌రుల‌పై మంత్రి ఆది త‌న‌యుడు దాడి చేశార‌న్న స‌మాచారాన్ని అందుకున్న ఎమ్మెల్సీ రామ‌సుబ్బారెడ్డి వారిని ప‌రామ‌ర్శించేందుకు బ‌య‌లుదేర‌గా పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి ఆది కుటుంబం క‌నుస‌న్న‌ల్లో పోలీసులు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News