అమితాబ్ గురించి హిల్ల‌రీకి ఎందుకు?

Update: 2016-11-05 05:27 GMT
హిల్ల‌రీ క్లింట‌న్ లీకేజీ మెయిల్ వ్య‌వ‌హారం ఇప్పుడు అమెరికాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇప్ప‌టికే ఈ అంశంపై ఎఫ్‌.బి.ఐ. కూడా ఇంకోప‌క్క విచార‌ణ సాగిస్తోంది. 2011లో హిల్ల‌రీ క్లింట‌న్ త‌న స్నేహితురాలు హ్యూమా అబిదెన్ కు ఒక మెయిల్ పంపించారు. పాకిస్థాన్ సంత‌తికి చెందిన అబిదెన్ కు హిల్ల‌రీ పంపిన ఆ మెయిల్ ద్వారా ఇద్దరు ఏ విష‌య‌మై చ‌ర్చించుకున్నారనే వివ‌రాల‌తో వాషింగ్ట‌న్ పోస్ట్ ఒక క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. లీకేజీ మెయిల్ ను య‌థాత‌థంగా అచ్చు వేసేసింది! విశేషం ఏంటంటే... హిల్ల‌రీ, అబిదెన్ ల మ‌ధ్య న‌డిచిన మెయిల్స్ లో ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు అబితాబ్ బ‌చ్చ‌న్ ప్ర‌స్థావ‌న రావ‌డం!

కొన్ని సంవత్స‌రాల కింద‌ట తాము ఒక ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడిని క‌లుసుకున్నామ‌నీ, ఆయ‌న పేరేంటీ అని హిల్ల‌రీ ఒక మెయిల్ లో పేర్కొన్నారు. దానికి అబిదెన్ రిప్లై ఇస్తూ... ఆ న‌టుడి పేరు అమితాబ్ బ‌చ్చన్ అని చెప్పారు. అయితే, ఈ ఇద్ద‌రి మ‌ధ్యా బ‌చ్చ‌న్ సాబ్ ప్ర‌స్థావ‌న ఎందుకు వ‌చ్చింద‌నేది మాత్రం మెయిల్ లో లేదు. అమితాబ్ గురించి హిల్ల‌రీ ఎందుకు వాక‌బు చేశారు అనేది కూడా అందులో లేదు! మొత్తానికి ఈ లీకేజీ వ్య‌వ‌హారం అధ్య‌క్ష ఎన్నిక‌ల వేళ అమెరికాలో చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.

హిల్ల‌రీ లీకేజ్ మెయిల్ గురించి వాషింగ్ట‌న్ పోస్ట్ ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురిస్తే, ఎన్నిక‌ల వేళ ఉగ్ర‌దాడుల‌కు ఆస్కారం ఉందంటూ మ‌రో మీడియా సంస్థ సీబీఎన్ ఓ వార్త‌ను ప్ర‌చురించింది. అధికారులంద‌రూ ఎన్నిక‌ల హ‌డావుడిలో ఉంటే, ఇదే త‌రుణంలో దాడులు చేసేందుకు ఉగ్ర‌వాదులు ప్ర‌య‌త్నించే అవ‌కాశం ఉంద‌నేది ఆ క‌థ‌నం సారాంశం. ఎన్నిక‌లకు ముందు రోజు.. అంటే, సోమ‌వారం నాడు అమెరికాలో ప్ర‌ముఖ న‌గ‌రాల‌పై అల్ ఖైదా దాడికి దిగే అవ‌కాశం ఉంద‌ని చెబుతోంది. టెక్సాస్‌, న్యూయార్క్‌, వ‌ర్జీనియా రాష్ట్రాల్లో టెర్ర‌రిస్టులు దాడులు చేసే అవ‌కాశం ఉంద‌ని స‌ద‌రు మీడియా సంస్థ చెప్పింది. ఈ వార్త‌పై ఎఫ్‌.బి.ఐ. వ‌ర్గాలు కూడా స్పందించాయ‌నీ... అనూహ్య‌మైన ప‌రిస్థితులు ఎదురైనా స‌మ‌ర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని అధికారులు చెప్పార‌ని కూడా ఆ క‌థ‌నం పేర్కొంది. ఇక్క‌డ గ‌మ‌నించాల్సింది ఏంటంటే... ఉగ్ర‌దాడులు జ‌రిగే అవ‌కాశం ఉందంటూ వ‌చ్చిన క‌థ‌నాన్ని అధికారులు ఖండించ‌డం లేదు, అలాగ‌ని అంగీక‌రించిన‌ట్టు కూడా స్పందించ‌లేదు!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News