ప్రపంచంలోనే ప్రత్యేకం ఈ పోలింగ్‌ కేంద్రం.. ఎందుకంటే!

Update: 2022-11-12 15:30 GMT
ప్రపంచంలో ఎత్తయినవి, చిన్నవి, పెద్దవి, పొడవైనవి తెలుసుకోవడానికి అందరూ ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. మరి ప్రపంచంలో అతి ఎత్తెన ప్రాంతంలో ఉన్న పోలింగ్‌ కేంద్రం ఎక్కడ ఉందో తెలుసా? ఈ పోలింగ్‌ కేంద్రం ప్రత్యేకతలు తెలుసుకోవాలని ఉందా? అయితే మీరు హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లాల్సిందే.

లాహౌల్‌ – స్పితి పరిధిలోని తషిగ్యాంగ్‌లో దాదాపు 15,256 అడుగుల ఎత్తులో ఇక్కడ ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కేవలం 52 మంది ఓటర్ల కోసమే అధికారులు ప్రత్యేకంగా పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం విశేషం. తషిగ్యాంగ్‌.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న పోలింగ్‌ కేంద్రంగా రికార్డు సృష్టించింది. అందుకే ప్రతి ఓటూ కీలకంగా భావించిన ఎన్నికల సంఘం అక్కడ ప్రత్యేకంగా దృష్టి సారించింది.

తషిగ్యాంగ్‌లో వృద్ధుల కోసం, దివ్యాంగుల కోసం మోడల్‌ పోలింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేశారు. వందకు వంద శాతం ఓటింగ్‌ నమోదు చేయాలని అధికారులు భావిస్తున్నారు.

కాంగ్రెస్‌–బీజేపీలకు చెరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తున్న హిమాచల్‌ ప్రదేశ్‌ ఓటర్లు.. ఈసారి ఎవరికి పట్టం కడతారనే చర్చ జోరుందుకుంది.

 హిమాచల్‌ ప్రదేశ్‌ పోలింగ్‌ నేపథ్యంలో ఓటింగ్‌ శాతం పెంచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో.. ప్రధాని మోదీ, అమిత్‌ షా సహా కీలక నేతలంతా ఓటేయాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.

కాగా హిమాచల్‌ప్రదేశ్‌లో 68 స్థానాలకు నవంబర్‌ 12న ఒకే విడతలో పోలింగ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ మరోమారు అధికారంలోకి రావడానికి ఉవ్విళ్లూరుతోంది. అయితే కాంగ్రెస్‌ పార్టీ రూపంలో బలమైన ప్రత్యర్థి ఉండటంతో బీజేపీ ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. అందులోనూ వరుసగా రెండుసార్లు అధికారాన్ని ఒకే పార్టీకి కట్టబెట్టిన చరిత్ర హిమాచల్‌ ప్రజలకు లేదు. అన్ని పార్టీల తరఫున 412 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. డిసెంబర్‌ 8న ఫలితాలు వెలువడనున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News