పెళ్లిలో ఎవరో ఒకరు మతం మారితేనే చట్టబద్ధం?

Update: 2015-11-19 14:24 GMT
మతాంతర ప్రేమపెళ్లికి సంబంధించి మద్రాస్ హైకోర్టు ఒక సంచలన తీర్పును ఇచ్చింది. మతాంతర ప్రేమపెళ్లికి సంబంధించి అబ్బాయి కానీ.. అమ్మాయి కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు.. మతం మారాలని.. ఇద్దరూ ఓకే మతస్తులుగా మారిన తర్వాత చేసుకున్న పెళ్లికి మాత్రమే చట్టబద్ధత లభిస్తుందని కోర్టు పేర్కొంది.

తమిళనాడుకు చెందిన ఒక మతాంతర ప్రేమపెళ్లికి సంబంధించిన కేసు ఒక మద్రాస్ హైకోర్టు విచారణకు వచ్చింది. ఈ కేసులో క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తి.. హిందూమతానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. దీనికి అమ్మాయి తరఫు తల్లిదండ్రులు వ్యతిరేకించి.. కుమార్తె ఆచూకీకి సంబంధించి హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. దీంతో.. ప్రేమికులను కోర్టుకు హాజరపర్చారు.

 ఈ సందర్భంగా ప్రేమికులను వారి పెళ్లి ఎలా జరిగిందని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి సమాధానం ఇచ్చిన వారు.. తాము గుడిలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నట్లు పేర్కొన్నారు. హిందూమతాన్ని స్వీకరించని పక్షంలో ఆ యువకుడు హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి చెల్లదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. ఇద్దరు ప్రేమికులు ఏదో ఒక మతానికి మారితేనే వారి పెళ్లి చెల్లుతుందని పేర్కొంది.

ఈ నేపథ్యంలో ప్రేమికులు ఇద్దరూ ఎవరి మతాన్న వారు కొనసాగించాలని భావిస్తే మాత్రం 1954 నాటి ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం వివాహం చేసుకోవాలని తేల్చింది. అయితే.. తాను మేజర్ ని అని.. తనకు నచ్చిన వారితో ఉండే హక్కు ఉందన్న అమ్మాయి మాటతో ఏకీభవించిన కోర్టు.. ఆ అమ్మాయి తల్లిదండ్రులు వేసిన హెబియస్ కార్పస్ ను కొట్టివేసింది. మద్రాస్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో వేర్వేరు మతాలకు చెందిన వ్యక్తులు పెళ్లి చేసుకుంటే వారి వివాహం చెల్లదని.. ఇద్దరు ప్రేమికుల్లో ఎవరో ఒకరు మరొకరి మతాన్ని స్వీకరించాలని స్పష్టం చేసినట్లే. సో.. మతాంతర వివాహాలు చేసుకునే వారు మద్రాస్ హైకోర్టు తాజా తీర్పు మీద ఒక లుక్ వేయటం మంచిది.
Tags:    

Similar News