హాట్‌ టాపిక్‌.. సీఎం జగన్‌తో కోడి కత్తి శీను కుటుంబం భేటీ!

Update: 2022-10-26 09:12 GMT
సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డితో కోడికత్తి శీను కుటుంబ సభ్యులు భేటీ అయ్యారు. ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. నాలుగేళ్ల క్రితం ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్‌ జగన్‌ ఉత్తరాంధ్రలో పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో నాంపల్లి కోర్టుకు విచారణకు హాజరయ్యేవారు. ఈ క్రమంలో ఆయన ప్రతి గురువారం మధ్యాహ్నం కల్లా పాదయాత్ర ఆపేసేవారు. విశాఖ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లేవారు.


ఈ క్రమంలో ఓసారి విశాఖ ఎయిర్‌పోర్టుకు వైఎస్‌ జగన్‌ వచ్చారు. అప్పుడు ఎయిర్‌పోర్టు క్యాంటీన్‌లో పని చేసే శ్రీను అనే వ్యక్తి టీ, కాఫీలు అందించే నెపంతో వీఐపీ లాంజ్‌లోకి వెళ్లాడు. అక్కడ జగన్‌పై చిన్న కోడికత్తితో దాడి చేశాడు. అయితే దీన్ని వైసీపీ హత్యాయత్నంగా అభివర్ణించింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడైన వ్యక్తికి చెందిన రెస్టారెంట్‌లోనే శ్రీను పనిచేస్తున్నాడని ఆరోపించింది. ఆయన ప్రోద్బలంతోనే జగన్‌ను హత్య చేయడానికి పథకం పన్నారని వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు.

కాగా జగన్‌కు కోడి కత్తి ఘటనలో గాయం కావడంతో వెంటనే జగన్‌ విమానం ఎక్కి వెళ్లిపోయారు. కానీ హైదరాబాద్‌ చేరుకున్నాక తన నివాసం లోటస్‌పాండ్‌ దగ్గరలో ఉన్న సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరారు. ఆ ఆస్పత్రి వైద్యులు తొమ్మిది కుట్లేశారు. దీంతో జగన్‌ మూడువారాలపాటు విశ్రాంతి తీసుకున్నారు. వైసీపీతోపాటు వైసీపీ అనుకూల మీడియా ఇది హత్యాయత్నమేనని ఆరోపించింది. మరోవైపు టీడీపీ జగన్‌ సానుభూతి కోసమే ఇలాంటి నాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టింది.

మరోవైపు పోలీసుల విచారణలో శీను జగన్‌ అభిమాని అని.. జగన్‌ పై ప్రజల్లో సానుభూతి రావడం కోసమే కోడికత్తితో గాయపర్చారని పోలీసులు తేల్చారు.

ఆ తర్వాత కోడి కత్తి శ్రీను జైలు పాలయ్యాడు. అప్పటి నుంచి అంటే నాలుగేళ్లుగా జైల్లోనే రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో శీను కుటుంబ సభ్యులు సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. తమ కుమారుడికి బెయిల్‌ ఇప్పించాలని ఆయనకు విన్నవించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్‌కు వినతిపత్రం అందజేశారు. శీను బెయిల్‌ కోసం నిరభ్యంతర పత్రం ఇవ్వాలని జగన్‌కు విన్నవించారు.

వయోభారంతో ఉన్న తమ పోషణ కష్టంగా మారిందని, జాలి చూపించాలని కోరారు. కాగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్‌ను కలిసినవారిలో లాయర్‌ సలీమ్‌తో పాటు శీను తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు ఉన్నారు. నాలుగేళ్ళుగా శీను రిమాండ్‌ ఖైదీగా ఇబ్బందులు పడుతుండడంతో తమ గోడు సీఎంకు చెప్పుకున్నామని కుటుంబసభ్యులు తెలిపారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News