పెగాస‌స్ మీద హౌస్ కమిటీ... ఇక ముందుకే..?

Update: 2022-03-25 08:28 GMT
పెగాసస్ ఏపీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అక్కడ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని ఏపీలో అధికార వైసీపీ రాజకీయ రచ్చకు తెరలేపింది.

మమతా బెనర్జీ పెగాసస్ వ్యవహరం మీద మాట్లాడుతూ ఏపీలో నాటి టీడీపీ ప్రభుత్వం స్పై సాఫ్ట్ వేర్ ని కొనుగోలు చేసిందని పేర్కొన్నట్లుగా వార్తలు వచ్చాయి.

ఇక వార్తలు వచ్చిన వెంటనే నాటి ఐటీ మంత్రి లోకేష్ అదంతా తప్పు, మేము నాడు ఎలాంటి స్పై సాఫ్ట్ వేర్ ని కొనుగోలు చేయలేదని ఖండించారు. దాని మీద నాటి ఇంటలిజెన్స్ డీజీపీ వెంకటేశ్వరరావు కూడా మీడియా సమావేశం పెట్టి మరీ ఏ రకమైన సాఫ్ట్ వేర్ ఏ రోజూ తామున్నప్పుడు  అసలు కొనలేదని పేర్కొన్నారు.

అయితే వైసీపీ సర్కార్ మాత్రం దీని మీద అసెంబ్లీలో చర్చ జరిపిందింది. సభా సంఘాన్ని ఈ మొత్తం వ్యవహారం విషయంలో అసలు నిజాలు వెలుగు చూసేందుకు వేయాలని కూడా తీర్మానించింది. ఇక తాజాగా పెగాసస్ మీద హౌస్ కమిటీని స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఏర్పాటు చేస్తూ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు.

ఈ హౌస్ కమిటీకి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి చైర్మన్ గా వ్యవహరిస్తారు. సభ్యులుగా పాడేరు ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మి,అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, మాజీ మంత్రి పార్ధసారధిలతో పాటు గుంటూరుకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున మద్దాలి గిరిధర్ ఉన్నారు.

సభా సంఘంలో మద్దాల  గిరిధర్ ని సభ్యుడిగా నియమించడం మాత్రం ఆసక్తికరంగానే ఉంది. అదెలా అంటే గిరిధర్ టీడీపీ సభ్యుడు. సాధారణంగా హౌస్ కమిటీ అంటే విపక్షాల నుంచి కూడా ఒకరిద్దర్ని నియమిస్తారు. గిరిధర్ టెక్నికల్ గా చూస్తే టీడీపీ మెంబర్. అయితే ఆయన తరువాత  వైసీపీ మద్దతుదారుగా ఉన్నారు.  టోటల్ గా చూస్తే ఈ సభా సంఘం అన్నది ఏం తేలుస్తుంది అన్నది చూడాలి.
Tags:    

Similar News