కేసీఆర్ ఫైర్ అవుతున్న వేళ ‘తెలంగాణ’ మూడ్ ఎలా ఉంది?

Update: 2021-07-05 03:51 GMT
మైండ్ గేమ్ కు కండబలంతో సమాధానం చెప్పటానికి మించిన పిచ్చితనం ఉండదు. వ్యూహాత్మకంగా వ్యవహరించటమే మేలు. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న జల వివాదం ఎపిసోడ్ ను చూసినప్పుడు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు తానుగా కెలికిన వైనమే తప్పించి మరింకేమీ లేదు. నిజంగానే తెలంగాణ ప్రజల ఆకాంక్షే కేసీఆర్ నిజమైతే ఎజెండా అయినప్పుడు.. ఈ ప్రాజెక్టుకు టెండర్లు పిలిచిన సందర్భంలో కిమ్మనకుండా ఉన్న గులాబీ బాస్.. ఇప్పుడు ఎందుకు గుండెలు బాదేసుకుంటున్నారన్న విషయం అందరికి తెలిసిన ఓపెన్ సీక్రెట్.

మరికొద్ది నెలల్లో ఈటల రాజేందర్ ఖాళీ చేసిన అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించి.. తన పదునైన మాటలతో.. ప్రసంగాలతో తెలంగాణ ప్రజల గుండెల్ని టచ్ చేసిన ఆయన ఈరోజున దోషిగా నిలబెట్టిన వైనం తెలిసిందే. కబ్జా నేరం చేశారన్న ఆరోపణలతో ఆయన మంత్రి పదవిపై వేటు వేసిన కేసీఆర్.. ఈటల రాజేందర్ రాజకీయ ప్రస్థానానికి పుల్ స్టాప్ పెట్టాలన్నట్లుగా ఆయన తీరు ఉందంటున్నారు. తనను ఎదిరించిన వారు ఎవరైనా సరే.. ముందుకు సాగేందుకు ఆయన ఇష్టపడరని చెబుతారు.

ఈ క్రమంలోనే ఈటలకు చెక్ చెప్పేందుకు జలవివాదాన్ని తెర మీదకు తీసుకురావటమే కాదు.. తెలంగాణ ప్రజల ఆశలు.. ఆకాంక్షల్ని కేసీఆర్ మాత్రమే నిలపగలరన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉంటున్నాయి. ఆయన తప్పించి మరెవరూ తెలంగాణ ప్రయోజనాల గురించి తపించలేరన్న భావన చెప్పేందుకు ఆయన కిందా మీదా పడిపోతున్నారు. దీనికి తోడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టటం.. కేసీఆర్ మీద ఘాటు విమర్శలు చేయటం.. వాటికి సమాధానాలు ఇచ్చేందుకు గులాబీ నేతలు ఎవరూ సిద్ధంగా లేకపోవటం తెలిసిందే.

తమపైనా.. తమ అధినేత పైనా ఈగ వాలితేనే విరుచుకుపడే అలవాటున్న టీఆర్ఎస్ నేతలు.. షర్మిల చేస్తున్న విమర్శలకు సూటి సమాధానాలు చెప్పలేకపోతున్నారు. త్వరలోనే మరింత యాక్టివ్ కానున్న ఆమెను నిలువరించటంతో  పాటు.. తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్ ను అందరిలో మరోసారి బయటకు తేవాలన్నదే గులాబీ బాస్ వ్యూహంగా చెబుతున్నారు. తన ఏడేళ్ల పాలనలో మరీ ఇంతటి యాక్టివ్ నెస్ ను గతంలో ఎప్పుడూ చూసింది లేదు. సినీ నటి కమ్ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేరోజా ఇంటికి వెళ్లి భోజనం చేసిన సందర్భంలో.. సీమను కోనసీమగా చూడాలన్న తన ఆకాంక్షను కేసీఆర్ వ్యక్తం చేయటం తెలిసిందే.

ఆయన నోటి నుంచి ఆ మాట వచ్చినంతనే తెలంగాణ నేతలు కానీ ప్రజలు కానీ విరుచుకుపడలేదు. కేసీఆర్ అలా ఎలా మాట్లాడతారు? ఏపీకి సాయం ఎందుకు చేయాలి? అన్న ప్రశ్నల్ని ఎవరూ సంధించలేదు. అంటే.. తెలంగాణ ప్రజలకు ఏపీకి సాయం చేసే విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదన్న విషయం ఇప్పటికే పలుమార్లు వెల్లడైంది. అమరావతి శంకుస్థాపన సమయంలో వెళ్లిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏపీకి ఏదైనా సాయం చేయాలని అనుకున్నానని.. అంత పెద్ద ప్రధాని నరేంద్ర మోడీనే ఇసుక.. నీళ్లు తీసుకొచ్చినప్పుడు.. తాను ఏదైనా ప్రకటన చేస్తే చిన్నబుచ్చినట్లు అవుతుందని ఊరుకున్నట్లుగా చెప్పారు.

ఈ మాటల్ని చెప్పినప్పుడు కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు ఎవరూ నిందించలేదు? దశాబ్దాల తరబడి తమను దోచుకున్నఏపీ పాలకులకు తగిన బుద్ది చెప్పాలే కానీ.. ఎవరబ్బ సొమ్ము అని ఏపీకి ఇవ్వాలనుకున్నావ్ ? అని నోరు పారేసుకోలేదు. నిజం చెప్పాలంటే.. తెలంగాణ తన ఆస్తిత్వం కోసమే పోరాడుతుంది. వీలైనంత వరకు సాయం చేస్తుంది. తనది కాసింత ఇవ్వటానికి మానవత్వంతో ముందుకు వస్తుంది. అంతే తప్పించి.. చీటికి మాటికి తగువులు పెట్టుకోవాలని అనుకోదు. ఈ విషయాలన్ని కేసీఆర్ కు తెలియనవి కావు.

కానీ.. తన రాజకీయ ఎజెండాలో భాగంగా ఆయన వీటిని గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేయటం లేదు. తన వద్ద ఉన్న తిరుగులేని అస్త్రాల్లో కీలకమైన దూకుడుతనాన్ని ప్రదర్శిస్తున్న కేసీఆర్ కీలకమైన పాయింట్ మిస్ అవుతున్నారు. ఎంత శక్తివంతమైన అస్త్రమైనా లోక కల్యాణం కోసం వినియోగించినప్పుడే సానుకూల ఫలితం ఉంటుంది. అందుకు భిన్నంగా అయితే.. ప్రయోగించిన వారికే సమస్యగా మారుతుంది. ఈ విషయాన్ని వేలాది పుస్తకాలు చదివిన కేసీఆర్ ఎందుకు మిస్ అవుతున్నట్లు?
Tags:    

Similar News