చంద్రబాబు అభిమాన జిల్లాలో జగన్ కు జేజేలు

Update: 2016-07-13 08:18 GMT
పశ్చిమగోదావరి జిల్లా... మొన్నటి ఎన్నికల తరువాత ఇది టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత ప్రీతిపాత్రమైన జిల్లాగా మారిపోయింది. మొత్తం అసెంబ్లీ - పార్లమెంటు సీట్లన్నీ టీడీపీకే రావడంతో తాను ముఖ్యమంత్రి కావడానికి అక్కడి ప్రజలు 100 పర్సంట్ సహకరించారంటూ చంద్రబాబు వారికి ఫిదా అయిపోయారు. అందుకే ప్రభుత్వ కార్యక్రమాలను అక్కడి నుంచే ప్రారంభించడంతో పాటు నిధులు కూడా కుమ్మరిస్తున్నారు. ఫలితంగా పశ్చిమ ఎమ్మెల్యే తమ ప్రాంతాలను బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తూ చంద్రబాబు ఇచ్చే ర్యాంకుల్లోనూ ముందుంటున్నారు. చంద్రబాబు కూడా ప్రతి సందర్భంలోనూ పశ్చిమగోదావరి ప్రజల రుణం తీర్చుకోలేనని పదేపదే చెబుతున్నారు.  అలాంటి పశ్చిమగోదావరి జిల్లా ఇప్పుడు చంద్రబాబుకు బద్ధ విరోధి అయిన జగన్ కు కూడా బ్రహ్మరథం పట్టడంపై టీడీపీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.

మొన్నటి ఎన్నికల్లో పశ్చిమలో వైసీపీకి సీట్లు రాకపోయినా జగన్ కు ఏమాత్రం ఆదరణ తగ్గలేదని రుజువైంది.  మంగళవారం నుంచి  ఉభయగోదావరి జిల్లాల పర్యటన ప్రారంభించిన జగన్..  కొద్దిసేపటి క్రితం పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడేనికి వచ్చారు.  అక్కడ ఏర్పాటు చేసిన  జగన్ బహిరంగ సభకు జనం హాజరుచూసిన టీడీపీ శ్రేణులకు మతిపోయిందట. చంద్రబాబు దీనిపై అడిగితే ఏం చెప్పాలా అని అక్కడి నేతల్లో భయం మొదలైందట.

టీడీపీకి కంచుకోటగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లా అంతా తమదేనని చంద్రబాబు చెబుతున్న తరుణంలో తన సభకు వచ్చిన జనాన్ని చూసిన జగన్ కు ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. దాంతో ఆయన ఉద్వేగభరితంగా ప్రసంగించారు. అయితే.. టీడీపీ నేతలు మాత్రం ఎక్కడ తేడా జరిగిందని చర్చించుకుంటున్నారట. జగన్ సభకు అంత భారీగా జనం ఎలా వచ్చారన్నది అర్థం కాక షాక్ తిన్నరు కూడా.
Tags:    

Similar News