హుజూర్‌ న‌గ‌ర్లో దెబ్బ ఎవ‌రికి...!

Update: 2019-10-13 14:30 GMT
హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికకు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో అన్ని పార్టీల్లో హైటెన్ష‌న్ నెల‌కొంది. పోలింగ్ కు ఇక వారం రోజులు మాత్ర‌మే మిగిలి ఉండడంతో ప్ర‌ధాన పార్టీలు అమీతుమీకి సిద్ధ‌మ‌వ‌తున్నాయి. ప్ర‌ధానంగా ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్‌ - టీఆర్ ఎస్‌ ల‌కు అగ్ని ప‌రీక్ష‌గా మారింది. హుజూర్‌ న‌గ‌ర్‌ లో ఎలాగైనా విజ‌యం సాధించాల‌ని ఆ రెండు పార్టీలు స‌ర్వ శ‌క్తులు ఒడ్డుతున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని ద‌క్కించుకునేందుకు కాంగ్రెస్ తీవ్రంగా శ్ర‌మిస్తోంది.

మ‌రోప‌క్క టీఆర్‌ఎస్‌ పార్టీ హుజూర్‌ న‌గ‌ర్‌ లో ఎలాగైనా గులాబీ జెండా ఎగుర‌వేయాల‌ని త‌హ‌తహ‌లాడుతోంది. అయితే ఆర్టీసీ కార్మికుల స‌మ్మెతో రాష్ట్రంలో ప‌రిణామాలు ఒక్క‌సారిగా మారిపోయాయి. ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నీ ఈ స‌మ్మెకు మ‌ద్ద‌తు ప‌లుకుతుండ‌గా - సీపీఐ కూడా ఆర్టీసీ కార్మికుల స‌మ్మెకు సంపూర్ణ మద్ద‌తు ప‌లికింది. ఈక్ర‌మంలోనే సీఎం కేసీఆర్ ప‌ట్టింపుల‌కు పోకుండా - ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించి - స‌మ్మె విర‌మ‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి చాడా వెంక‌ట్‌ రెడ్డి డిమాండ్ చేశారు. అంతేగాక ప్ర‌భుత్వం మూడు రోజుల్లో ఆర్టీసీ కార్మికుల‌తో స‌మ్మె విర‌మింప‌జేస్తేనే - టీఆర్ ఎస్‌ కు మ‌ద్ద‌తు ఇస్తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

అయితే స‌మ్మె విష‌యంలో ఆర్టీసీ యూనియ‌న్ నేత‌ల‌తో చ‌ర్చ‌లు ఉండ‌వ‌ని కుండ‌బ‌ద్ధ‌లు కొట్టారు. అంతేగాక ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వం ఉదాసీనంగా ఉంద‌ని - ఇకపై క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని ఆయ‌న తీవ్ర హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ముఖ్య‌మంత్రి వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి ప్ర‌భుత్వం ఆర్టీసీ స‌మ్మెపై వెన‌క్కిత‌గ్గే యోచ‌న‌లో లేన‌ట్టే క‌న‌పిస్తుంది. ఈక్ర‌మంలోనే ఆర్టీసీ కార్మికుల స‌మ్మెకు అన్ని వ‌ర్గాల నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తుండ‌టం.. ప్ర‌భుత్వం నిరంకుశంగా వ్య‌వ‌హిరిస్తున్న ప‌రిస్థితుల్లో ఇక అధికార పార్టీకి హుజూర్‌ న‌గ‌ర్‌ లో మ‌ద్ద‌తు ఇస్తే పార్టీకి తీవ్ర న‌ష్టం త‌ప్ప‌ద‌ని నేత‌లు భావిస్తున్నారు.

ఈక్ర‌మంలోనే ఒక‌టి రెండు రోజుల్లో త‌మ మ‌ద్ద‌తును ఉప‌సంహ‌ర‌ణ‌పై నేత‌లు ఒక ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంది. నియోజ‌క‌ర్గంలో సుమారు 6 నుంచి 8 వేల వ‌ర‌కు ఓటు బ్యాంకు క‌లిగిన సీపీఐ ఒక‌వేళ గ‌నుక నిజంగా టీఆర్ ఎస్‌ కు మ‌ద్దతు ఉప‌సంహ‌రించుకుంటే అధికార పార్టీకి న‌ష్టం త‌ప్ప‌ద‌ని విశ్లేష‌కులు అ భిప్రాయ‌ప‌డుతున్నారు. ఇప్ప‌టికే రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల స‌మ్మె నేప‌థ్యంలో అధికార పార్టీపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉంద‌ని - ఈ అంశాన్నికాంగ్రెస్‌ తో స‌హా ప్ర‌తిప‌క్షాలు అనుకూలంగా మ‌లుచుకుంటే హుజూర్‌ న‌గ‌ర్ ఉప ఎన్నిక‌పై ఆ ప్ర‌భావం కూడా ప‌డే అవ‌కాశం ఉంద‌ని అంతా భావిస్తున్నారు.


Tags:    

Similar News