కూకట్‌ పల్లి ఎందుకింత లొల్లి..!?

Update: 2018-10-06 04:22 GMT
కూకట్‌ పల్లి తెలంగాణ రాజధాని పరిథిలోని కీలక నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో 90% మంది ఓటర్లు సెట్టిలర్లే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ లో ఓ అగ్ర కులానికి చెందిన వారే ఎక్కువ. దీంతో ఇక్కడ నుంచి ఆ అగ్రకుల పార్టీగా ముద్ర పడిన తెలుగుదేశం పార్టీ అనేక సార్లు విజయం సాధించింది. రాజకీయాలలో పెద్దగా అనుభవం లేకపోయిన కొత్తగా పెట్టిన లోక్‌ సత్తా నాయకుడు జయప్రకాష్ నారయణ కూడా ఇక్కడ నుంచే శాసనసభకు ఎన్నికయ్యారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన ఎన్నికలలో కూడా కూకట్‌ పల్లిలో తెలుగుదేశం - బిజేపీల ఉమ్మడి అభ్యర్దే గెలిచారు. ఇలా కూకట్‌ పల్లి నియోజకవర్గం రాష్ట్ర రాజధాని హైదారబాద్‌ లో విశిష్ట స్ధానాన్ని పొందింది. ఇప్పుడు జరగనున్న ముందస్తు ఎన్నికలలో కూడా కూకట్‌ పల్లి నియోజకవర్గం అత్యంత ప్రాధాన్యతను కనబరుస్తోంది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితిని ఎలాగైన ఓడించేందుకు జట్టు కడుతున్న మహాకూటమిలో కూడా కూకట్‌ పల్లి నియోజకవర్గం చర్చగా మారింది. సెటిలర్లపై నమ్మకంతో అన్నీ పార్టీల అభ్యర్దులు తమకంటే తమకు ఇవ్వాలంటూ ఆయా పార్టీల నాయకులపై వత్తిడి తెస్తున్నారు. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఈ స్ధానాన్ని సిట్టింగ్‌ కే వదిలి వేసింది.

తెలుగుదేశం పార్టీకి మంచి పట్టు ఉంటుందనుకుంటున్న కూకట్‌ పల్లి నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా తెలుగుదేశానికే వదిలి వేయాలని ఆ పార్టీ నాయకులు పట్టుబడుతున్నారు. మహాకూటమిలో భాగస్వామ్య పక్షాలు కూడా ఆ డిమాండ్ సరైనదే అంటున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ కూకట్‌ పల్లి నియోజకవర్గ ఇన్‌ చార్జ్ శేరి సతీష్‌ రెడ్డి తనకే కేటాయించాలని పీసీసీ చీఫ్‌ ఉత్తమ కుమార్ రెడ్డిని కోరుతున్నారు. తన వర్గీయులతో కలసి గాంథీ భవన్ ఎదుట ధర్నా కూడా చేసారు. ఎన్ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బి. వెంకట్ కూడా ఈ టిక్కెట్టు కోసం పట్టుబడుతున్నారు. ఈ ఇద్దరూ కాక కూకట్‌ పల్లి నియోజకవర్గం టిక్కెట్టు స్ధానికులకే కేటాయించాలని మరో వర్గం డిమాండ్ చేస్తోంది. తెలుగుదేశం పార్టీలో కూడా ఈ టిక్కెట్టు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది.  ఇక్కడి గెలుపు "కమ్మ" గా ఉంటుందని అన్నీ రాజకీయ పార్టీల నాయకుల నమ్మకం. దీంతో తెలంగాణ ముందస్తు ఎన్నికలలో కూకట్‌ పల్లి నియోజకవర్గానికి ఎనలేని ప్రాధాన్యత వస్తోంది.
Tags:    

Similar News