ఓటేసేందుకు ఏపీకి ఎంతమంది వెళ్లారో చెప్పే ఫోటో

Update: 2019-04-11 05:11 GMT
ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి ఎంత మంది వెళ్లి ఉంటారు? ఇప్పుడీ ప్రశ్న చాలామంది నోట వినిపిస్తోంది. దీనికి సమాధానంగా ఐదు లక్షలని కొందరు.. కాదు పది లక్షలు అని మరికొందరు చెబుతున్నారు. వాస్తవంగా సంఖ్య ఎంత ఉంటుందన్న విషయాన్ని చెప్పే వీలు లేని పరిస్థితి. అయితే.. తాజాగా వైరల్ అవుతున్న ఒక్క ఫోటోను చూస్తే.. ఏపీకి ఎంత మంది వెళ్లి ఉంటారో అర్థమయ్యే పరిస్థితి.

ఈ రోజు (గరువారం) జరిగే ఎన్నికల పోలింగ్ కోసం మంగళవారం నుంచే హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లటం మొదలైంది. ఆ రోజు ఉదయం నుంచే రైళ్లు ఫుల్ అయ్యాయి. ఇది మొదలు బుధవారం అర్థరాత్రి దాటే వరకూ వెళుతూనే ఉన్నారు. ఇక.. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లిన వారి సంఖ్య ఎంత ఉంటుందన్న దానికి సమాధానం అంకెలతో చెప్పలేమని చెబుతున్నారు.

ఒక అంచనా ప్రకారం.. సంక్రాంతి వేళకు హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు వెళ్లే వారి సంఖ్య కంటే ఎన్నికల్లో ఓటు వేయటానికి వెళ్లిన వారి సంఖ్య ఎక్కువగా ఉందన్న మాట వినిపిస్తోంది. వాస్తవానికి పలువరి ఓట్లు లేకపోవటం వల్ల వారు తమ ప్రయాణాలు వాయిదా వేసుకున్నారు కానీ.. లేకుండా మరింత రద్దీ ఎక్కువగా ఉండేదన్న మాట ఉంది.

బుధవారం ఉదయం 9 గంటల నుంచి అర్థరాత్రి దాటిన తర్వాత వరకూ ఏపీ వైపు వెళ్లే వాహనాలు కచ్ఛితంగా టచ్ చేయాల్సిన పంతంగి టోల్ ప్లాజా వద్ద.. మినిమం కిలో మీటర్ నుంచి మ్యాగ్జిమంగ రెండున్నర కిలోమీటర్ల వరకూ వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి. సంక్రాంతి సీజన్లో కిలో మీటర మేర వాహనాలు ఆగిపోవటం.. కొద్ది గంటల్లో సర్దు కోవటం జరిగేది. కానీ.. ఇందుకు భిన్నంగా బుధవారం మాత్రం  ఉదయం నుంచి అర్థరాత్రి దాటిన తర్వాత కూడా భారీగా వాహనాలు ఏపీకి వెళ్లాయి. గతంలో ఎప్పుడూ కనిపించని మరో సీన్ ఏమంటే.. బస్సులు.. కార్లు కాకుండా.. టూవీలర్ల మీద ఏపీకి పయనమైన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు.

రైళ్లల్లో రిజర్వేషన్లు లేకపోవటం.. బస్సుల టికెట్లు భారీగా ఉండటం.. రోడ్ల మీద ట్రాఫిక్ జాం కారణంగా.. వాటిని అధిగమించేందుకు వేలాది మంది టూ వీలర్ల మీద ఏపీకి జంటలుజంటలుగా పయనమైన వైనం కనిపించింది. పండగలు.. పర్వదినాలు.. లాంగ్ వీకెండ్లు వచ్చినప్పుడు హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లటం మామూలే. కానీ.. ఈసారి మాదిరి గతంలో మరెప్పుడు కనిపించలేదంటున్నారు. దీనికి ఈ ఫోటోనే సాక్ష్యంగా చెప్పక తప్పదు. 
Tags:    

Similar News