జనసేనకు భారీ షాక్.. ‘గాజు గ్లాసు’ గుర్తు ఇప్పుడు అందరిది

Update: 2021-09-26 06:30 GMT
గాజు గ్లాస్.. అదేనండి.. టీ గ్లాస్ అన్నంతనే జనసేన పార్టీ సింబల్ గా గుర్తుకు వస్తుంది. అయితే.. ఈ విషయంలో ఇప్పుడో కీలక మార్పు చోటు చేసుకుంది. ఇకపై.. గాజు గ్లాస్ గుర్తు జనసేన పార్టీకి మాత్రమే సొంతం కాదు. ఎవరైనా సొంతం చేసుకోవచ్చు. ఎందుకిలా? అంటే.. కేంద్ర ఎన్నికల సంఘం  తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ పుణ్యమా అని.. ఇలాంటి పరిస్థితి నెలకొంది. సినీ నటులు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తును గతంలో ఎన్నికల సంఘం కేటాయించింది.

2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అభ్యర్థులంతా ఈ  గుర్తు మీదనే పోటీ చేశారు. అయితే.. ఆ పార్టీకి ఒక్క సీటు మాత్రమే లభించింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో జనసేన తన మిత్రుడైన బీజేపీకి సీట్లను త్యాగం చేయటంతో ఇప్పుడు గాజుగ్లాస్ గుర్తు కాస్తా మిస్ అయ్యింది. ఇటీవల జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. దీంతో.. ఆ గుర్తును ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి కేటాయించారు. దీనిపై జనసేన న్యాయపోరాటం చేసింది. కానీ.. ఫలితం లేకుండా పోయింది.
తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో దేశ వ్యాప్తంగా ఉన్న పార్టీల్లో ఎనిమిది పార్టీలు మాత్రమే జాతీయ పార్టీలుగా పేర్కొంది. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు..తమది జాతీయ పార్టీగా అభివర్ణించేవారు.

అందుకు తగ్గట్లే తన పదవిని జాతీయ పార్టీ అధ్యక్షుడిగా చెప్పుకునే వారు. దీనిపై బోలెడన్ని విమర్శలు రాగా.. కొందరైతే కామెడీ చేసుకున్నారు కూడా. తాజాగా టీడీపీని ప్రాంతీయ పార్టీగా ఈసీ తన నోటిఫికేషన్ లో పేర్కొంది.

ఏపీలో ప్రాంతీయ పార్టీలుగా వైసీపీ.. టీడీపీకి మాత్రమే గుర్తించింది. జనసేనను గుర్తింపు లేని రాజకీయ పార్టీగా పేర్కొంది. దీంతో.. ఆ పార్టీకి గుర్తుగా ఉన్న గాజు గ్లాస్ ఇప్పుడు ఎవరికైనా కేటాయించే వీలుంది. ఎందుకంటే.. ఇప్పుడీ సింబల్ ఫ్రీ సింబల్ గా మారటమే. ఏపీలో రెండు పార్టీలను మాత్రమే ప్రాంతీయ పార్టీలుగా గుర్తించిన ఈసీ..తెలంగాణ విషయానికి వస్తే.. టీఆర్ఎస్.. మజ్లిస్.. వైసీపీ.. టీడీపీలకు రిజర్వ్ డ్ గుర్తుల్ని కేటాయించింది. అంటే.. ఈ పార్టీలో తెలంగాణలో తమ గుర్తులతో పోటీ చేసే వీలుంది. తాజా నోటిషికేషన్ మీద జనసేన రివ్యూ అడిగే అవకాశం ఉందని చెబుతన్నారు. అయితే.. పదే పదే త్యాగాలు.. మిత్రత్వం పేరుతో మొదటికే మోసం తీసుకొస్తున్నారని.. పార్టీ విషయాల మీద పవన్ మరింత శ్రద్ధ చూపిస్తే మంచిదన్న ధర్మాగ్రహాన్ని పవన్ అభిమానులు.. సానుభూతిపరులు ప్రదర్శిస్తున్నారు.
Tags:    

Similar News