ప్ర‌కృతి ప‌గబ‌ట్టినా..నిర్ల‌క్ష్యంతోనే భారీ మూల్యం?

Update: 2018-10-01 06:08 GMT
ఇండోనేషియాలో చోటు చేసుకున్న ప్ర‌కృతి విల‌యాన్ని ప్ర‌తి ఒక్క‌రు తిట్టిపోసేటోళ్లే. ప్ర‌కృతి ప‌గ‌బ‌ట్టింద‌ని ఆడిపోసుకునే మాట‌ల్ని ప‌క్క‌న పెడితే.. ప్ర‌కృతి త‌న ప‌ని తాను చేసుకుంద‌ని అనుకుందాం. కానీ.. అలాంటి ప‌రిస్థితుల‌కు అవ‌కాశం ఉంద‌ని తెలిసిన మ‌నిషి జాగ్ర‌త్త ఏమైంది?  నిజంగానే అప్ర‌మ‌త్తంగా ఉంటే.. ఇంత‌టి విల‌యం చోటు చేసుకునేదా?  అంటే లేద‌నే చెప్పాలి.

ఇండోనేషియాలోని సుల‌వేసి ద్వీపంలో చోటు చేసుకున్న భూకంపం-సునామీ కార‌ణంగా జ‌రిగిన విధ్వంసంలో ప్ర‌కృతి పాత్ర కంటే కూడా మ‌నిషి నిర్ల‌క్ష్య‌మే కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. భూకంపం-సునామీ లాంటివి చోటు చేసుకునే ప్ర‌మాదాన్ని ముందుగా ప‌సిగ‌ట్టి అలెర్ట్ చేసే వ్య‌వ‌స్థ‌లు నిద్రాణంగా ఉండ‌టం.. అవ‌న్నీ నిర్ల‌క్ష్యంతో స‌రిగా ప‌ని చేయ‌క‌పోవ‌ట‌మే భారీ విధ్వంసానికి ప్ర‌ధాన కార‌ణంగా చెప్పాలి.

నిజానికి సునామీలు ఇండోనేషియాకు కొత్తేం కాదు. జ‌పాన్ కు భూకంపాలు ఎంత కామ‌నో.. ఇండోనేషియాకు సునామీలు అంతే కామ‌న్‌.దీనికి త‌గ్గ‌ట్లే.. సునామీ హెచ్చ‌రిక వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసుకున్న‌ప్ప‌టికీ ఇండోనేషియా అధికారుల నిర్ల‌క్ష్యం కార‌ణంగానే తీవ్ర న‌ష్టం వాటిల్లిన‌ట్లుగా చెప్పాలి. 2004లో చోటు చేసుకున్న సునామీ విల‌యంతో క‌ళ్లు తెరిచిన అధికారులు అప్ప‌టినుంచి సునామీ ప్ర‌మాదాన్ని గుర్తించే సెన్సార్లు.. ఫైబ‌ర్ ఆప్టిక్ కేబుల్స్.. బోయెల‌తో ఒక ప్రోటోటైప్ వ్య‌వ‌స్థ‌ను అభివృద్ధి చేశారు. అమెరికా - జ‌ర్మ‌నీ - మ‌లేషియా - ఇండోనేషియా శాస్త్ర‌వేత్త‌ల బృందం దీన్ని త‌యారుచేశారు. దీని కోసం అమెరికా జాతీయ సూన్స్ ఫౌండేష‌న్ రూ.21.75 కోట్లు కేటాయించింది కూడా.ఈ హెచ్చ‌రిక వ్య‌వ‌స్థ‌ను పూర్తిస్థాయిలో అమ‌లు చేయ‌టానికి అవ‌స‌ర‌మైన రూ.50 ల‌క్ష‌ల మొత్తాన్ని ఇండోనేషియా ప్ర‌భుత్వం విడుద‌ల చేయ‌క‌పోవ‌టంతో అందుకు ల‌క్ష‌ల‌ రెట్ల భారీ న‌ష్టాన్ని ఈ రోజు అక్క‌డి ప్ర‌భుత్వం చెల్లించాల్సి వ‌చ్చింది.

ప్ర‌భుత్వ ఆర్థిక ప‌రిస్థితి బాగోలేదంటూ..ప్ర‌కృతి విప‌త్తును హెచ్చ‌రించే వ్య‌వ‌స్థ‌ల‌కు అవ‌స‌ర‌మైన రూ.50 ల‌క్ష‌ల నిధులు విడుద‌ల చేయ‌క‌పోవ‌టంతో ఈ హెచ్చ‌రిక వ్య‌వ‌స్థ నిర్వ‌హ‌ణ స‌రిగా లేదు. దీంతో.. స‌ముద్ర గ‌ర్భంలోని ప్ర‌కంప‌న‌లు ప‌సిగట్టే బోయెలు చెడిపోగా.. మ‌రికొన్ని చోరీకి గుర‌య్యాయి. అంతేకాదు.. సునామీని ముందుగా హెచ్చ‌రించే టైడ్ గేజ్ లు కూడా ప్ర‌జ‌ల్ని అప్ర‌మ‌త్తం చేసే విష‌యంలో ఫెయిల్ అయ్యారు.

సునామీల‌ను గుర్తించే ఫైబ‌ర్ కేబుల్స్ కొనుగోలుకు ఆర్థిక ప‌రిస్థితి బాగోలేదంటూ నిధుల‌ను విడుద‌ల చేయ‌ని ఇండోనేషియా ప్ర‌భుత్వం ఈ మ‌ధ్య‌నే ఓకే చేసింది. అంత‌లోనే ఇలాంటి ప‌రిస్థితి చోటు చేసుకుంది. భూకంప తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేల్ పైన 7.5 ఉండ‌టంతో ప్ర‌జ‌లు క‌కావిక‌ల‌మ‌య్యార‌నీ.. ఈ సంద‌ర్భంగా విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోవ‌టంతో సునామీ హెచ్చ‌రిక సైర‌న్లు అధికారులు మోగించ‌లేదు. అంతేకాదు.. భూకంపాల స‌మ‌యంలో ఎత్తైన కొండ ప్రాంతానికి అవగాహ‌న ప్ర‌జ‌ల్లో లేక‌పోవ‌టం కూడా సునామీలో చిక్కుకొని దుర్మ‌ర‌ణం పాల‌వ్వ‌టానికి ప్ర‌ధాన కార‌ణంగా చెబుతున్నారు. ఇదంతా చూసిన‌ప్పుడు నింద‌ను ప్ర‌కృతి మీద వేసే క‌న్నా.. మ‌నిషి మీదా.. అంత‌కు మించి పాల‌కుల నిర్ల‌క్ష్యం మీద వేస్తే స‌బ‌బుగా ఉంటుందేమో?
Tags:    

Similar News