అమెరికాలో ‘ఎమర్జెన్సీ’ని ప్రకటించిన ఒబామా

Update: 2016-10-07 07:06 GMT
ప్రపంచానికే పెద్దన్న లాంటి అమెరికాలో ఎమర్జెన్సీనా? అంత ఉపద్రవం ఏమొచ్చిందన్న సందేహం అక్కర్లేదు. ఎంత పెద్దన్న అయినా.. ప్రకృతి ముందు చంటిపిల్లే కదా? ప్రపంచంలో తిరుగులేని శక్తిగా ఉండే అమెరికాకు ప్రకృతితో వచ్చే ఇబ్బందులు అన్నిఇన్ని కావు. తరచూ హరికేన్లతో అతలాకుతలమయ్యే అమెరికాను తాజాగా ఒక భారీ హరికేన్‌ వణికిస్తోంది.

అత్యంత శక్తివంతమైన ఈ హరికేన్ ప్రభావంతో హైతీలో గంటకు230 కిలోమీటర్ల వేగంతో గాలులు రావటంతో పాటు.. భారీ నష్టాన్ని మిగిల్చింది. అమెరికా వైపు తరలి వెళుతున్న ఈ హరికేన్‌.. అగ్రరాజ్యంలో కూడా పెను నష్టాన్ని వాటిల్లేలా చేస్తుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. హైతీలో 339 మందిని చంపిన మాథ్యూ హరికేన్.. ఇప్పుడు అమెరికాపై తన పంజా విసరటానికి సిద్ధమవుతోంది.

తాజాగా విరుచుకుపడే అవకాశం ఉన్న మాథ్యూ హరికేన్ నాలుగో కేటగిరి తుఫాను కావటంతో అమెరికా అధ్యక్షుడు ఒబామా అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఎమర్జెన్సీని ప్రకటించారు. ఫ్లోరిడా.. జార్జియా రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన ఆయన.. అత్యంత వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని.. తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ హెచ్చరించారు. గడిచిన పదేళ్లలో ఇంత తీవ్రమైన హరికేన్ రాలేదని..  తీరం సమీపానికి వచ్చే వేళకు దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. తాజా హరికేన్ తో ఫ్లోరిడాలోని అట్లాంటిక్ తీరం మొత్తం ప్రభావితం అవుతుందని చెబుతున్నారు. అమెరికా లాంటి దేశంలోనే అత్యవసర పరిస్థితి అంటేనే.. మాథ్యూ హరికేన్ ఎంత ప్రమాదకరమైనదన్నది ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News