భర్త స్నానం చేయట్లేదని విడాకులు కోరిన భార్య

Update: 2019-04-13 05:50 GMT
రోజులు మారుతున్నాయి. దానికి తగ్గట్లే ప్రాధాన్యాలు మారుతున్నాయి. వివాహ వ్యవస్థలో వచ్చిన మార్పుల గురించి తెలిసిందే. గతానికి భిన్నంగా భార్య.. భర్తలు విడిపోవటానికి పెద్ద పెద్ద కారణాలు అక్కర్లేదు. చూసేటోళ్లకు చిన్నకారణాలుగా అనిపించినా.. ఇలాంటి కారణాలతో తాను కాపురం చేయలేకపోతున్నానని.. అర్జెంట్ గా విడాకులు కావాలని అడిగే ఉదంతాలు బోలెడన్ని చోటు చేసుకుంటున్నాయి.

తాజాగా అలాంటి ఉదంతం ఒకటి తెర మీదకు వచ్చింది. అడిగింది కొనివ్వటం లేదని.. బయటకు తీసుకెళ్లటం లేదని.. గడ్డం గీసుకోలేదని విడాకులు అడిగే ఉదంతాల్ని చూశాం. తాజాగా స్నానం చేయట్లేదన్న కారణాన్ని చూపించి విడాకులు అడిగిన మహిళ ఉదంతం ఒకటి తెర మీదకు వచ్చింది.

మధ్యప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతంలోకి వెళితే.. ఏడాది క్రితం ఒక జంట పెళ్లి జరిగింది. తాజాగా వారు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎందుకని కోర్టు కోరగా.. ఊహించని కారణాన్ని వెల్లడించింది సదరు మహిళ. తన భర్త రోజుల తరబడి స్నానం చేయటం లేదని.. ఏదైనా అంటే పర్ ఫ్యూమ్ కొట్టుకుంటున్నాడని పేర్కొంది. అందుకే..తనకు విడాకులు కావాలని కోరింది.

దీనిపై స్పందించినకోర్టు.. ఆర్నెల్లు ఇద్దరు విడివిడిగా ఉండాలని.. ఆ తర్వాత విడాకుల సంగతి చూస్తామని భోపాల్ ఫ్యామిలీ కోర్టు వెల్లడించింది. చూస్తుంటే.. రానున్న రోజుల్లో మరెలాంటి కారణాలతో విడాకులు అడుగుతారో ఊహిస్తేనే చెమటలు పట్టటం ఖాయం. కాదంటారా?
Tags:    

Similar News