హైదరాబాద్లో కొత్త కాన్సెప్ట్.. పైసలు కొట్టు.. వస్తువులు పగులగొట్టు..!

Update: 2022-11-17 01:30 GMT
తన కోపమే తనకు శత్రువు అని మన పెద్దలు ఎప్పుడు చెబుతుంటారు. కోపం వల్ల ఒక్కో సందర్భంలో మనిషి తన సర్వస్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ పనికిరాని కోపం వల్ల అనారోగ్య సమస్యలు కూడా తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎవరైతే తమ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటారో వాళ్లే తమ జీవితాన్ని పూర్తి ప్రశాంతంగా గడుపుతారని నిపుణులు పేర్కొంటున్నారు.

అయితే అందరికీ కోపం ఒకే రీతిలో ఉండదు. అలాగే పరిస్థితిని బట్టి చూపించే కోపం కూడా మారుతూ ఉంటుంది. కొంతమంది కోపం వస్తే సైలంట్ ఉండిపోతారు. మరికొందరేమో పెద్దగా అరవడం చేస్తున్నారు. ఇంకొందరేమో తమ చేతులకు ఏ వస్తువు దొరికితే దానిని విసిరి వేయడమో లేదా పగులగొట్టడమో చేస్తుంటారు.

ఇలాంటి వాళ్లు మన నిత్య జీవితంలో ఎప్పుడో ఒకసారి తారసా పడే ఉంటారు. అయితే వీరిలో మొదటి ఇద్దరితో పెద్దగా ప్రాబ్లం ఉండదు. కానీ చివరి వారితోనే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కోపంలో చేతికి ఏది దొరికితే దానిని ఇతరుల మీదకి విసిరితే ఒక్కసారి ప్రాణాలు కూడా పోయే అవకాశం కూడా ఉంటుంది.

అయితే ఈ సమస్యకు హైదరాబాద్ కుర్రాడు ఒక పరిష్కారాన్ని చూపించాడు. ఎవరికైనా విపరీతమైన కోపం వస్తే తమ రూముకు వచ్చి వస్తువులు పగులగొట్టి కోపాన్ని తగ్గించుకోవచ్చని చెబుతున్నాడు. ఈ తరహా కాన్సెప్ట్ ఇండియాలో ఇదే మొదటి కావడంతో దీని గురించి పూర్తిగా తెలుసుకునేందుకు ప్రతీఒక్కరూ ఆసక్తి చూపిస్తున్నారు.

హైదరాబాద్ కు చెందిన 25 ఏళ్ళ సూరజ్ కు చిన్నతనం నుంచి ఒక అలవాటు ఉండేది. తనకు ఎప్పుడైనా కోపం వస్తే ఇంట్లోని వస్తువులన్నీ పగులగొట్టి తన కోపాన్ని తీర్చుకునేవాడు. అయితే ఇంట్లోని వస్తువులను పగులగొట్టకుండా కోపాన్ని ఎలా తీర్చుకోవాలనే ఆలోచన నుంచి ‘రేంజ్ రూమ్’ పుట్టిందని సూరజ్ చెబుతున్నారు. తన లాంటి వారికి ఈ రేంజ్ రూమ్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. తద్వారా వారంతా కూడా కోపాన్ని కంట్రోల్ చేసుకునే అవకాశం దొరకుతుందని చెబుతున్నాడు.  

అయితే ఈ రేంజ్ రూమ్ కు వెళ్లేందుకు మాత్రం కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీనిని మూడు విభాగాలుగా విభజించి సూరజ్ రేట్లు ఫిక్స్ చేశాడు. ‘క్వికీ’ ప్యాకేజీ కింద రూ.1300 చెల్లించే వారికి ఏడు సీసాలు.. కీబోర్డులు.. స్పీకర్లు.. ఎలక్ట్రానిక్ వస్తువులను పగలగొట్టే అవకాశం ఉండనుంది. ‘రఫ్ డే’ ప్యాకేజీ కింద రూ.1500 చెల్లించే వారికి 15 బాటిళ్లతో కూడిన రెండు డబ్బాలు.. ప్లాస్టిక్.. ఎలక్ట్రానిక్ వస్తువులను పగలగొట్ట అవకాశం లభిస్తుందని సూరజ్ తెలిపాడు.

ఇక చివరగా ‘రేజ్ మోడ్ ’ ప్యాకేజీ కింద రూ.2800లు చెల్లించే వారికి  వాషింగ్ మెషిన్.. టెలివిజన్ సెట్.. రిఫ్రిజిరేటర్.. ల్యాప్ ట్యాప్ వంటి భారీ వస్తువులు పగులగొట్టే అవకాశం ఉంటుందని తెలిపాడు. ఈ వస్తువులు పగులగొట్టే వారికి రక్షణగా హెల్మెట్ తోపాటు షూస్.. ప్రత్యేకమైన దుస్తులు ఇస్తారు. వస్తువులు పగులగొట్టేందుకు 20 నిమిషాల సమయం ఉంటుంది. ఈ తరహా కాన్సెప్ట్ విదేశాల్లో ఇప్పటికే ఉందని ఇండియాలో మాత్రం ఇదే మొదటిదని సూరజ్ తెలిపాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News