మెట్రో హౌస్‌ ఫుల్ అయినా ఐదేళ్లు న‌ష్టాలేన‌ట‌

Update: 2017-12-02 05:07 GMT
క‌ల‌ల మెట్రో రైల్ క‌ళ్ల ముందుకు వ‌చ్చేసింది. ఎప్పుడెప్పుడు ఎక్కుదామా? అనుకున్న న‌గ‌ర‌వాసులు ఇప్పుడు మెట్రోలో ప్ర‌యాణిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. హైద‌రాబాదీల మోజుతో మెట్రో సూప‌ర్ హిట్ కావ‌ట‌మే కాదు..  ఇప్ప‌టివ‌ర‌కూ మెట్రోలో ఉన్న రికార్డుల‌న్నీ బ‌ద్ధ‌లైపోతున్నాయి. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కూ ప‌లు న‌గ‌రాల్లో మెట్రో రైళ్లు అందుబాటులోకి వ‌చ్చినా.. తొలిరోజు రికార్డు మాత్రం హైద‌రాబాద్ మెట్రోదే.

దేశంలోని ఇత‌ర మెట్రో రైల్  ప్రారంభం రోజున యాభై వేల మంది మాత్ర‌మే ప్ర‌యాణిస్తే.. హైద‌రాబాద్ మెట్రోలో ఏకంగా రెండు ల‌క్ష‌ల మంది ప్ర‌యాణించారు. మొద‌టిరోజు ఉబ‌లాటం అనుకున్న వారి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ రెండో రోజు కూడా 1.70 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణికులు ప్ర‌యాణిస్తే.. మూడో రోజు అదే హ‌డావుడి కొన‌సాగిన‌ట్లుగా మెట్రో అధికారులు చెబుతున్నారు.

మెట్రో అధికారుల మాట‌లు చూస్తే.. మిగిలిన మెట్రోల మాదిరే హైద‌రాబాద్ మెట్రో గ‌ణాంకాలు ఉంటాయ‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. మిగిలిన మెట్రోల‌లో తొలిరోజు 50 వేల మంది ప్ర‌యాణించార‌న్న లెక్క‌ల‌కు త‌గ్గ‌ట్లే హైద‌రాబాద్ మెట్రోలోనూ ఆ ర‌ద్దీకి స‌రిప‌డా ఏర్పాట్లు చేశారు. దీని కార‌ణంగానే.. తొలి రోజు అమీర్ పేట మెట్రో స్టేష‌న్లో చోటు చేసుకున్న భారీ ర‌ద్దీ.

మ‌రింతగా ఆద‌ర‌ణ పొందుతున్న మెట్రోకు లాభాల వ‌ర్ష‌మేనా? అంటే కాద‌న్న మాట‌ను చెబుతున్నారు. ప్రాజెక్టును అనుకున్న స‌మ‌యంలో పూర్తి చేసి ఉంటే బాగుండేద‌ని.. ఆల‌స్యం కార‌ణంగా దాదాపు రూ.4వేల కోట్ల అద‌న‌పు భారం ప‌డిందంటున్నారు. ఈ ఆల‌స్యానికి బాధ్య‌త వ‌హిస్తూ తెలంగాణ రాష్ట్ర సర్కారు ఎంత స‌ర్దుబాటు చేస్తుందో.. దానికి అనుగుణంగా లాభ‌న‌ష్టాలు ఉంటాయ‌ని చెబుతున్నారు.

మొద‌ట అనుకున్న ప్ర‌కారం 2017 జూన్ నాటికి మెట్రో రైలు పూర్తి కావాల్సి ఉంది. కానీ.. 2018 న‌వంబ‌రు నాటికి పూర్తి చేస్తామ‌ని చెబుతున్నారు. ఈ లెక్క‌న చూసుకుంటే ఆల‌స్యం ఏడాదిగా క‌నిపిస్తుంది. ఈ ఆల‌స్యం కార‌ణంగా మెట్రో నిర్మాణ సంస్థ అయిన ఎల్ అండ్ టీ మీద రూ.4వేల కోట్ల అద‌న‌పు భారం ప‌డిన‌ట్లుగా చెబుతున్నారు. త‌మ మీద ప‌డిన భారాన్ని చెల్లించాలంటూ తెలంగాణ రాష్ట్ర స‌ర్కారును ఎల్ అండ్ టీ కోరింది. ఇందుకు త‌గ్గ‌ట్లు ఒక లేఖ కూడా రాసింది.

2010 సెప్టెంబ‌రులో మొద‌లైన వేళ ఈ ప్రాజెక్టు ఖ‌ర్చు రూ.14,132 కోట్లుగా అంచ‌నా వేశారు.అసెంబ్లీ.. ఓల్డ్ సిటీ.. సుల్తాన్ బ‌జార్ ప్రాంతాల్లో అలైన్ మెంట్ మార్పుపై ప్ర‌భుత్వం ప‌లుమార్లు త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లతో స్ప‌ష్ట‌త ఇవ్వ‌క‌పోవ‌టంతో ప‌నులు ఆల‌స్య‌మ‌య్యాయి. దీంతో రూ.4వేల కోట్ల అద‌న‌పు భారం ప్రాజెక్టు మీద ప‌డింది. క‌ల‌ల మెట్రో ర‌ద్దీతో న‌డుస్తున్నా లాభాలు రావాలంటే మ‌రో ఆరేళ్లు ఆగాల్సిందేనంటున్నారు. ఐదేళ్ల పాటు న‌ష్టాల బాట త‌ప్ప‌ద‌న్న మాట వినిపిస్తోంది. మెట్రో ప్రాజెక్టు వ్య‌యంలో 50 శాతం ప్ర‌యాణికుల ఛార్జీలు.. 45 శాతం వాణిజ్య స్థ‌లాలు.. ర‌వాణా ఆధారిత అభివృద్ధి ప్రాజెక్టులు..  5 శాతం ప్ర‌క‌ట‌న‌ల ఆదాయం ద్వారా 45 ఏళ్ల పాటు స‌మ‌కూర్చుకోవాల్సి ఉంటుంది. నిర్మాణ ఒప్పందం ప్ర‌కారం ఈ గ‌డువును మ‌రో 20 ఏళ్ల పాటు పొడిగించుకునే వీలుంది. మెట్రో రైలు ప‌రుగులు తీసే నాటికి ప్ర‌భుత్వం కేటాయించిన కీల‌క ప్రాంతాల్లో 18 మాల్స్ (269 ఎక‌రాల్లో) నిర్మించి.. 60 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల వాణిజ్య స్థ‌లాల్ని నిర్మించాల‌నుకున్నారు. కానీ.. ఇప్ప‌టికి పంజాగుట్ట‌. హైటెక్ సిటీల‌లో 8 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలోనే మాల్స్ ఏర్పాటు అయ్యాయి. వ‌చ్చే ఏడాది చివ‌ర‌కు మ‌రో 10 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల క‌మ‌ర్షియ‌ల్ స్పేస్ అందుబాటులోకి రానుంది. అంటే ముందు అనుకున్న దాని కంటే దాదాపు 42 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల వాణిజ్య స్థ‌లం లోటు ఉన్న‌ట్లు. మ‌రింత వ్య‌త్యాసం ఉన్న వేళ‌.. మెట్రోకు లాభాలు ర‌మ్మంటే వ‌స్తాయా?
Tags:    

Similar News