హైదరాబాదీయులకు మెట్రో రైల్ ఆఫర్.. అదెలానంటే?

Update: 2020-10-17 04:15 GMT
వేలాది కోట్లు ఖర్చు చేసి నిర్మించిన హైదరాబాద్ మెట్రో రైలు ఇప్పుడో పెద్ద సమస్యను ఎదుర్కొంటోంది. ఆశించిన దాని కంటే గ్రాండ్ సక్సెస్ అయిందని సంబరపడిపోతున్న వేళ.. కరోనా రూపంలో మెట్రోకు తగిలిన షాక్ అంతా ఇంతా కాదు. అన్ లాక్ లో భాగంగా మెట్రో రైలును తిరిగి పట్టాల మీదకు తీసుకొచ్చినా.. ఎలాంటి ప్రయోజనం కలుగలేదు. మహమ్మారి భయానికి మెట్రో రైలు ఎక్కటానికి హైదరాబాద్ ప్రజలు పెద్దగా ఇష్టపడటం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే మెట్రోను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది.

ఈ నేపథ్యంలో రద్దీని పెంచుకోవటానికి వీలుగా మెట్రో రైలు బంఫర్ ఆఫర్ ను తెర మీదకు తీసుకొచ్చింది. ప్రైవేటు సంస్థలు ఏలా అయితే.. భారీ ఆఫర్లను ప్రకటించి.. వాటికి పరిమితులు విధిస్తారో.. సరిగ్గా అదే విధానాన్ని హైదరాబాద్ మెట్రో కూడా అమలు చేస్తోంది. అప్ టు 50 పర్సంట్ క్యాష్ బ్యాక్ అని చెబుతున్నప్పటికీ.. ప్రయాణికులకు నికరంగా మేలు చేకూరేది 40 శాతమని లెక్కలు చెబుతున్నారు.

స్మార్ట్ కార్డు ద్వారా క్యాష్ బ్యాక్ పొందే వీలుంది. పద్నాలుగు ట్రిప్పుల ఖర్చుతో 20 ట్రిప్పుల్ని తిరిగే వీలు ఉంటుంది. అదే సమయంలో 20 ట్రిప్పుల ఖర్చుతో 30 ట్రిప్పులు తిరిగే అవకాశాన్ని కల్పించనున్నారు. ఒకవేళ 40ట్రిప్పులకు 60 ట్రిప్పులు తిరిగేలా మరో ఆఫర్ ను ప్రకటించారు. దాదాపు రెండు నెలల పాటు సాగే ఈ ఆఫర్ ను హైదరాబాద్ ప్రజలు ఏ మేరకు ఉపయోగించుకుంటారో చూడాలి.

10 ట్రిప్పులకు కనిష్ఠంగా రాయితీ లభిస్తే.. 40 ట్రిప్పులకు సదుపాయాన్ని వినియోగిస్తే.. గరిష్ఠ రాయితీ లభించే వీలుంది. పది ట్రిప్పుల రాయితీని 30 రోజుల్లో వినియోగించుకునే వీలుంది. అదే సమయంలో 60 ట్రిప్పుల రాయితీని సొంతం చేసుకునేందుకు 60 రోజుల గడువు ఇస్తున్నారు. నవంబరు ఒకటి నుంచి మొదలయ్యే ఈ ఆఫర్ ఈ ఏడాది చివరి వరకు ఉండనుంది.
Tags:    

Similar News