మొద‌టిదే దిక్కు లేదు మెట్రో రెండో ద‌శ‌?

Update: 2017-09-28 03:40 GMT
ఈ మ‌ధ్య కాలంలో ప్ర‌ముఖ మీడియాల‌లో వ‌స్తున్న వార్త‌ల హ‌డావుడి చూశారా? ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమ‌లింగం అన్న‌ట్లుగా వార్త‌ల్ని వండేస్తున్న తీరు చూస్తుంటే అవాక్కు అవ్వాల్సిందే. పాత్రికేయుడు ప్రాధ‌మికంగా చేయాల్సిన ప‌నిని వ‌దిలేసి.. త‌న‌కు పూర్తి భిన్న‌మైన పిసుకుడు కార్య‌క్ర‌మాన్ని మొద‌లు పెట్టిన తీరు చూసిన‌ప్పుడు అయ్యో అనుకోకుండా ఉండ‌లేని ప‌రిస్థితి.

హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రానికి మ‌ణిహారం లాంటి మెట్రో రైల్ ప్రాజెక్టు ఇష్యూలో ఉన్న ముచ్చ‌ట్లు అన్నిఇన్ని కావు. మ‌రో రెండు నెల‌ల్లో ప్రారంభం కానున్న మెట్రో కారిడార్ 1కు సంబంధించి పెండింగ్ ప‌నులు కుప్ప‌లు కుప్ప‌లు ఉన్నాయి. వాటి విష‌యంలో ఏదైనా అడిగితే అటు ప్ర‌భుత్వం కానీ.. ఇటు మెట్రో రైల్ కానీ ఇంకా టైం ఉంది.. నిర్ణ‌యాలు తీసుకోలేద‌న్న మాట ప‌దే ప‌దే చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల కాలంలో ఒక‌రికి మించి మ‌రొక‌రు పోటాపోటీగా మెట్రో రైల్ రెండో ద‌శ విస్త‌ర‌ణ ప్రాజెక్టును తెర మీద‌కు తీసుకొస్తున్నారు.

రూ.15వేల కోట్ల అంచ‌నాతో మొద‌లై మెట్రో రైల్ ప్రాజెక్టు అనుకున్న టైంకి పూర్తికాక‌పోవ‌టం ఒక ఎత్తు అయితే.. దాని మీద ప‌డిన అద‌న‌పు భారానికి సంబంధించిన లెక్క‌ల్ని ఎవ‌రూ చెప్ప‌టం లేదు. డిజైన్ మార్పువిష‌యంలో తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ చెప్పిన మాట‌లు.. అందుకు చేసిన హ‌డావుడి.. త‌ర్వాతి కాలంలో ఆయ‌న మాట మారిన విష‌యం చూస్తే.. రాజ‌కీయ కార‌ణాలతో మెట్రో ఆల‌స్య‌మైంద‌న్న‌ది అస‌లు నిజం. ఆ మాట‌ను రాసే ద‌మ్ము.. ధైర్యం చేయ‌ని మీడియా ప్ర‌తినిధులు.. త‌మ రాత‌ల‌తో ఎప్పుడు జ‌రుగుతుందో తెలీని  క‌మ్మ‌టి క‌ల‌ల్ని క‌నేలా ప్ర‌జ‌ల్ని చేస్తున్నారు.

మెట్రో మొద‌టి ద‌శ పూర్తి కావ‌టానికి ఎదుర‌వుతున్న ఆటంకాలు.. ఆల‌స్య‌మ‌య్యే ప్ర‌తి రోజు చివ‌ర‌కు ప్ర‌జ‌ల‌కు ఎలా భారంగా మారుతుంద‌న్న విష‌యాల్ని వివ‌రించే ప‌ని చేయ‌ని మీడియా సంస్థ‌లు అందుకు భిన్నంగా కొత్త త‌ర‌హా వార్త‌ల‌కు తెర తీశారు.

ఇందులో భాగంగా ఇప్పుడు మెట్రో 2 ద‌శ‌ను తెర మీద‌కు తెస్తున్నారు. మొద‌టిద‌శ‌ను ఇప్పుడు చెబుతున్న స‌మ‌యానికి మ‌రింత ముందుగా పూర్తి చేయాల‌న్న మాట‌ల్ని వ‌దిలేసి.. సాధ్య‌మ‌వుతుందో లేదో తెలీని రెండో ద‌శ మీద క‌ల‌లు క‌న‌టం మొద‌లెట్టారు. మెట్రో విస్త‌ర‌ణ‌లో భాగంగా కొత్త మార్గం మీద ప్ర‌భుత్వం ఫోక‌స్ చేసింద‌ని చెబుతున్నారు.

ఈ రెండో ద‌శ‌కు సంబంధించిన సాధ్యాసాధ్యాల్ని తెలిపేందుకు.. రెండో ద‌శ ఏయే రూట్ల‌లో ఉండాల‌న్నది ఖ‌రారు చేసేందుకు ఢిల్లీ మెట్రో రైల్‌ కు అప్ప‌చెప్పారు. ఇటీవ‌ల ప్ర‌భుత్వానికి అందుకు సంబంధించిన నివేదిక‌ను ప్ర‌భుత్వానికి అంద‌జేశారు.
 
దీనికి అయ్యే ఖ‌ర్చును రూ.15వేల కోట్లుగా చెబుతున్నా.. ప్రాజెక్టు మొద‌ల‌య్యేస‌రికి పెరిగే ధ‌ర‌ల‌తో ఇది కాస్తా రూ.20వేల కోట్లు కావటం ఖాయ‌మంటున్నారు. ఒక‌వేళ‌.. ప్రాజెక్టు ఆల‌స్య‌మైతే మ‌రింత భారం ప‌డే ప్ర‌మాదం ఉంది. ఇంత‌కీ విస్త‌ర‌ణ‌లో భాగంగా క‌వ‌ర్ అయ్యే ప్రాంతాలు ఏమిటంటే.. మియాపూర్ నుంచి ప‌టాన్ చెర్వు.. ఎల్ బీన‌గ‌ర్ నుంచి ఆరామ్ ఘ‌ర్‌.. మ‌రొక‌టి మాదాపూర్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ గా చెబుతున్నారు. ఏదో అద్భుతం జ‌రిగిపోతుంద‌న్న‌ట్లుగా భ‌విష్య‌త్‌ కు సంబంధించిన వార్త‌లు రాసే క‌న్నా.. వ‌ర్త‌మానంలో జ‌రుగుతున్న అంశాల‌పై వార్త‌లు రాయాల్సిన అవ‌స‌రం ఉంది.కానీ.. ఇప్ప‌టి రోజుల్లో ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ల‌న్నీ ప్ర‌భుత్వాల‌ను ఆకాశానికి ఎత్తేయ‌టం.. వారి విజ‌న్ ప్లాన్ల‌ను నిత్యం వండి వార్చ‌టం పైనే దృష్టి పెడుతుంద‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు. ఈ జోరు ఇలా కొన‌సాగితే.. వాస్త‌వం ప్ర‌జ‌ల‌కు చేరే అవ‌కాశాలు మ‌రింత‌గా మూసుకుపోవ‌టం ఖాయం.


Tags:    

Similar News