ద‌డ పుట్టించే వైనం హైద‌రాబాద్ మెట్రోలో చోటు చేసుకుంది!

Update: 2019-07-27 11:14 GMT
విన్నంత‌నే వామ్మో అనుకోవ‌ట‌మే కాదు.. కాస్త స్థిమితంగా ఆలోచించినా వెన్నులో వ‌ణుకు పుట్టించే ఘోర ప్ర‌మాదం ఒక‌టి తృటిలో త‌ప్పింది. ఇప్ప‌టివ‌ర‌కూ చిన్న చిన్న ఫిర్యాదులు త‌ప్పించి మొత్తంగా హైద‌రాబాద్ మెట్రోకు సంబంధించి సీరియ‌స్ కంప్లైంట్స్ లేవు. అలాంటిది.. హైద‌రాబాద్ మెట్రో సాంకేతిక మీద కొత్త సందేహాలు వ్య‌క్త‌మ‌య్యే ప‌రిణామం ఒక‌టి చోటు చేసుకుంది.

సుమారు 400 మంది ప్ర‌యాణికుల‌తో మియాపూర్ నుంచి ఎల్బీ న‌గ‌ర్ వైపు మెట్రో రైలు వెళుతోంది. అయితే.. ఈ ట్రైన్ ల‌క్డీకాపూల్ స్టేష‌న్ కు కాస్త ముందు.. ఒక ట్రాక్ లో వెళ్లాల్సిన ట్రైన్ మ‌రో ట్రాక్ లో ప్ర‌యాణిస్తున్న వైనాన్ని గుర్తించిన డ్రైవ‌ర్ వెంట‌నే ఆ రైలును ల‌క్డీకాపూల్ స్టేష‌న్ వ‌ద్ద నిలిపివేశారు.

అనంత‌రం ప్ర‌యాణికుల్ని దించేసి రైలు వెన‌క్కి వెళ్లింది. ఈ ఉదంతంతో ఉలిక్కిప‌డిన అధికారులు వెంట‌నే మెట్రో సేవ‌ల్ని దాదాపు అర‌గంట పాటు నిలిపివేశారు. ఒక‌వేళ‌.. వ్య‌తిరేక దిశ‌లో కానీ రైలు వ‌చ్చి ఉంటే ప‌రిస్థితి ఏమిటి? అన్న ఊహే భ‌యం క‌లిగించటం ఖాయం. అయితే.. ఒకే ట్రాక్ మీద నుంచి రెండు ట్రైన్లు వ‌చ్చినా.. అవి ఆగిపోతాయ‌ని.. అలాంటి సాంకేతిక‌త ఉంద‌న్న మాట చెబుతున్నా.. ఇప్పుడు జ‌రిగిన‌ట్లే.. పొర‌పాటు జ‌రిగితే ఏమిట‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధానం ల‌భించ‌ని ప‌రిస్థితి.

ఇంత‌కీ ఈ ప్ర‌మాదం ఎందుకు చోటు చేసుకుంది. సాంకేతికంగా అత్యున్న‌త ప‌రిజ్ఞానాన్ని వాడుతున్న‌ట్లు చెబుతున్న హైద‌రాబాద్ మెట్రో.. ఈ విష‌యం మీద వివ‌ర‌ణ ఇవ్వాల్సి ఉంది. తాజా త‌ప్పు వెనుక సాంకేతిక త‌ప్పిద‌మా?  మాన‌వ త‌ప్పిద‌మా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.


Tags:    

Similar News