సైబర్ నేరాల్ని లెక్క తేల్చే ఉన్నతాధికారికి తీర్చలేని కష్టం

Update: 2021-10-26 13:30 GMT
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో సైబర్ నేరాల లెక్క తేల్చే విభాగం ఒకటుంది. దానికి ఏసీపీగా వ్యవహరిస్తుంటారు కేవీఎం ప్రసాద్. నిజాయితీ అధికారిగా పేరు మాత్రమే కాదు.. కష్టమైన.. క్లిష్టమైన సైబర్ నేరాల అంతు చూసే విషయంలో ఆయనకు ఆయనే సాటిగా చెబుతారు. నిత్యం పదుల సంఖ్యలో వచ్చే సైబర్ నేరాలకు సంబంధించి నిందితుల్ని పట్టుకునే విషయంలో.. బాధితుల్ని ఆదుకునే విషయంలో ఆయన స్పందించే తీరు అభినందించేలా ఉంటుంది. అలాంటి ఆయనకు వ్యక్తిగతంగా పెద్ద కష్టమే వచ్చింది. పగ వాళ్లకు కూడా రాకూడదని భావించే కష్టం ఇప్పుడు ఆయనకు వచ్చి పడింది.

ఆయన సతీమణి ఈ మధ్యన పెళ్లికి వెళ్లారు. ప్రకాశం జిల్లా చీరాలకు సమీపంలోని ఈపురుపాలెంలో వారి పెళ్లి. ముందుగా అనుకున్న ప్రకారం పెళ్లి తర్వాత రైల్లో హైదరాబాద్ కు ఆమె రావాలి. అయితే.. ఆమె బంధువులు..మేడ్చల్ వద్ద ఉంటే ప్రసాద్ సోదరుడి కుమారుడు హైదరాబాద్ కు కారులో వస్తున్నారు. కారులో మేం ముగ్గురమే వెళుతున్నాం.. మీరు కూడా రండని చెప్పటంతో ప్రసాద్ సతీమణి శంకరమ్మ కారు ఎక్కారు.

ఆదివారం రాత్రి 10.30 గంటలకు బయలుదేరిన వారు సోమవారం ఉదయం హైదరాబాద్ కు చేరుకున్నారు. పెద్ద అంబర్ పేట అవుటర్ రింగు రోడ్డులోకి ఎక్కారు. కీసర మండలం యాద్గార్ పల్లి సమీపంలోని డీఆర్ డీవో వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి.. అతి వేగంగా డివైడర్ ను ఢీ కొట్టింది. వెనుక సీట్లోకూర్చున్న శంకరమ్మ.. రేణుక తలలు వెనుక అద్దానికి బలంగా తగలటంతో అక్కడికక్కడే మరణించారు. కారు నడుపుతున్న బాలక్రిష్ణ చికిత్స పొందుతూ మరణించారు. శంకరమ్మ హైదరాబాద్ లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో.. సదరు పోలీసు అధికారి తీవ్రమైన శోకంలో కూరుకుపోయారు. ఆయనకు వచ్చిన కష్టానికి పోలీసు సిబ్బంది తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News