వాహనాల మీద పెండింగ్‌ ఫైన్లు కట్టేయండి

Update: 2015-06-28 04:20 GMT
కానిస్టేబుల్‌ చేతిలోని లాఠీ కంటే.. అతగాడి చేతిలోని కెమేరా అత్యంత ప్రమాదకరమైనది. రోడ్డు క్రాస్‌ చేసే సమయంలో నిబంధనలు పాటించకున్నా.. సిగ్నల్‌ జంప్‌ చేసినా.. రాంగ్‌ పార్కింగ్‌ చేసినా.. మారు మాట్లాడకుండా.. తన చేతిలో ఉన్న కెమేరాను క్లిక్‌ చేయటం ఈ మధ్యకాలంలో జరుగుతున్న వ్యవహారం.

కొన్ని సందర్భాల్లో వాహనదారులు తమ వాహనానికి సంబంధించి ఫోటో తీసుకున్నారన్న అవగాహన లేకుండా ఉంటుంటారు. ఇలా ఫోటోలు తీసిన వాటిని చలానాలుగా మార్చి ఆయా ఆడ్రస్‌లకు పంపుతారు. వీటికి స్పందించే వారు కొందరు పట్టించుకోని వారు మరికొందరు. కొన్ని చలానాలు అయితే.. జనరేట్‌ అవుతాయి కానీ వాటి సమాచారం సంబంధిత వాహన యజమానికి చేరవు.

పలు కారణాల కారణంగా.. వాహనాల మీద వేసిన జరిమానాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న వాటికి సంబంధించి పోలీసులు అధికారులు కొత్త నిర్ణయం తీసుకునే వీలుంది. వివిధ సందర్భాల్లో తెలిసినా.. తెలియకపోయినా తప్పులు చేసి.. వాటికి సంబంధించిన జరిమానాలు కట్టకుండా కాలం గడిపేసే వారికి షాక్‌ ఇచ్చేలా అధికారులు ఒక నిర్ణయాన్ని తీసుకోనున్నారు.

దీని ప్రకారం.. ఒక వాహనంపై కనీసం మూడు చలానాలు చెల్లించకుండా పెండింగ్‌ ఉన్న వాహనదారులపై ఛార్జిషీట్లు దాఖలు చేయాలని భావిస్తున్నారు. ఒకవేళ ఆ సందర్భంలోనూ జరిమానా కట్టకుంటే వారిని అరెస్ట్‌ చేసి కోర్టు ముందు హాజరు పర్చాలని భావిస్తున్నారు. ఇలాంటి కేసులు దాదాపు వేలాదిగా ఉండటంతో.. ఈ కేసుల్ని పరిష్కరించటం కోసం మొత్తంగా 17 కోర్టులు సిద్ధం అయ్యాయి. వీటిల్లో ట్రాఫిక్‌ కేసులను మాత్రమే విచారిస్తారు.

హైదరాబాద్‌ మహానగరంలో మొత్తంగా ఉన్న 45 లక్షల వాహనాల్లో.. ట్రాఫిక్‌ ఉల్లంఘటనల కింద రెండు లక్షల వాహనాలకు సంబంధించి పదిలక్షల చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని వసూలు చేసేందుకు పోలీసులు ఛార్జిషీట్లు.. అరెస్టులు లాంటి వాటికి రెఢీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో.. మీకు తెలిసి.. తెలియక మీ వాహనాల మీద ఎదైనా జరిమానా ఉందా? అన్న విషయాన్ని ముందస్తుగా తనిఖీ చేసుకొని చెల్లిస్తే మంచిది. లేదంటే.. లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లే సుమా.

Tags:    

Similar News