ఎవ్వ‌రు ఏం చేసినా.. న‌న్ను ఆప‌లేరుః కేసీఆర్‌

Update: 2021-07-04 16:30 GMT
ఎవ‌రు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా.. త‌న‌ను అడ్డుకోలేర‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో సీఎం ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. ప్రారంభోత్స‌వాలు చేశారు. అనంత‌రం నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ మాట్లాడారు.

తెలంగాణ‌లో ఎన్నో సంస్క‌ర‌ణ‌లు ప్ర‌వేశ‌పెట్టామ‌ని, అందులో ప‌రిపాల‌నా సంస్క‌ర‌ణ‌లు ముఖ్య‌మైన‌వ‌ని అన్నారు. ఈ ఫ‌లితాలు కూడా మ‌న క‌ళ్ల ముందే క‌నిపిస్తున్నాయ‌ని చెప్పారు. ప‌రిపాల‌నా సంస్క‌ర‌ణ‌ల్లో భాగంగా ఏర్పాటు చేసుకున్న కొత్త జిల్లాల‌తో ప్ర‌జ‌ల‌కు మెరుగైన పాల‌న అందుతోంద‌ని అన్నారు.

రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో క‌లెక్ట‌రేట్ ఏర్పాటు కావ‌డం చాలా సంతోషంగా ఉంద‌న్నారు. రాష్ట్రం ఏర్ప‌డ‌క ముందు ఎన్నో వాదాలు.. ప్ర‌తివాదాలు న‌డిచాయ‌ని అన్నారు. అయితే.. అవ‌న్నీ ప‌టా పంచ‌లు అయ్యాయ‌ని అన్నారు.

మ‌న‌కు అప న‌మ్మ‌కాలు ఎక్కువ‌గా ఉంటాయ‌న్న కేసీఆర్‌.. ల‌క్ష్య శుద్ధి, చిత్త‌శుద్ధి, వాక్ శుద్ధి ఉంటే.. ఏ ప‌ని అయినా వంద‌శాతం విజ‌య‌వంతం అవుతుంద‌ని అన్నారు. ఇందుకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే.. ఉదాహ‌ర‌ణ అని అన్నారు. రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత ఒక ల‌క్ష్యం ఏర్పాటు చేసుకున్నామ‌ని, ఆ దిశ‌గా ప్ర‌యాణం సాగిస్తున్నామ‌ని, ఫ‌లితాలు క‌ళ్ల‌ముందు క‌న‌బ‌డుతున్నాయ‌ని అన్నారు. రాబోయే రోజుల్లోనూ.. ఇదే విధ‌మైన అభివృద్దిని కొన‌సాగిస్తామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ చెప్పారు.
Tags:    

Similar News