నేను బతికి ఉన్నాగా?... రాష్ట్రానికి ఏమీ కాదు!

Update: 2016-09-17 04:37 GMT
ఉత్తర ప్రదేశ్‌ లో నెలకొన్న రాజకీయ సంక్షోభాగ్నిని ఆర్పివేసేందుకు తన వంతు ప్రయత్నాలు సాగించిన సమాజ్‌ వాదీ అధినేత ములాయం సింగ్ యాదవ్ లక్నోలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. తాను బతికి ఉన్నంత వరకూ పార్టీ విడిపోబోదని - తమది ఓ పెద్ద కుటుంబం కాబట్టి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు సహజమేనని అన్నారు. తాను ఉన్నంత వరకూ ఎవరూ కూడా తమ కుటుంబంలో చిచ్చు పెట్టలేరని స్పష్టం చేశారు. ఉదయం పార్టీ కార్యాలయానికి వచ్చిన ములాయం సోదరుడు శివపాల్ యాదవ్ తోను - కుమారుడు అఖిలేష్ యాదవ్‌ తోను విడివిడిగా సమావేశమై మాట్లాడారు. వారి మధ్య సయోధ్యను కుదిర్చారు. శివపాల్ రాజీనామాను తిరస్కరిస్తున్నట్టు అఖిలేష్‌ తో చెప్పించారు. ఆపై ఇద్దరినీ తీసుకుని తన ఇంటికి వెళ్లారు ములాయం. అక్కడ అందరూ కలసి మధ్యాహ్న భోజనం చేశారు.

తండ్రీ కొడుకుల మధ్యే తేడాలు వస్తుంటాయని చెప్పిన ములాయం - మీడియా ముందు మాట్లాడుతూ చెప్పిన ఓ చిన్న మాట కారణంగానే ఇంత రభస జరిగిందని, ఇప్పుడు అంతా సమసిపోయిందని అన్నారు. ఆపై అఖిలేష్ మాట్లాడుతూ - ఓ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు సేవలు అందించడంతో పాటు, ఓ కొడుకుగా తన తండ్రిని సంతోషపెట్టాల్సిన బాధ్యత తనపై ఉందని, ఆయన మాటను తాను జవదాటబోనని అన్నారు. ఈ రభసకు కారణమైన వ్యక్తిపై చర్యలు తీసుకునేందుకు తన తండ్రి అంగీకరించారని, అమర్ సింగ్ పేరు చెప్పకుండా వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవికి తన బాబాయ్ శివపాల్ యాదవ్ చేసిన రాజీనామాలను తిరస్కరిస్తున్నట్టు చెప్పారు. పార్టీని తదుపరి ఎన్నికల్లో గెలిపించడమే లక్ష్యంగా తాము కలసి పని చేస్తామని స్పష్టం చేశారు.

అంత‌కుముందు తన తండ్రి - సమాజ్‌ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌ తో మాట్లాడిన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తమ ఇంటిలో కలహాలకు తాజాగా పార్టీలో చేరిన అమర్ సింగ్ కారణమన్న అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. తన తండ్రితో చర్చల అనంతరం పార్టీలో - ప్రభుత్వంలో బయటి వారి ప్రమేయం ఉండరాదన్న నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఇటీవలి వివాదాలకు బయటి వ్యక్తుల ప్రమేయం పెరగడం కూడా ఓ కారణమేనని టీవీ చానల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. అమర్ సింగ్‌ కు ప్రాతినిధ్యం పెరుగుతుండడం - ఇటీవల ఆయన ఇచ్చిన విందుకు ములాయం సోదరుడు శివపాల్ సింగ్ యాదవ్ వెళ్లడం - దాన్ని తేలికగా తీసుకోలేకపోయిన అఖిలేష్ అతని మంత్రి పదవుల నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఆపై యూపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయన్న ఆలోచనతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ములాయం స్వయంగా రంగంలోకి దిగి సోదరుడు - కుమారుడి మధ్య సఖ్యత తెచ్చేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
Tags:    

Similar News