జగన్ పార్టీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. మరో సారి పోటీ చేయను

Update: 2020-01-03 05:32 GMT
ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ.. ఒకసారి పదవిని చేపట్టిన తర్వాత.. మళ్లీ.. మళ్లీ ఆ పదవిని చేపట్టాలని.. అవసరమైతే అప్ గ్రేడ్ కావాలనుకోవటం చూస్తుంటాం. కానీ.. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏపీ అధికార పార్టీకి చెందిన నేత ఒకరు చేసిన తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాను ఓట్లు అడుక్కోనని.. ఎమ్మెల్యే గా పోటీ చేయనంటూ చెప్పటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి భద్రతా వ్యవహారాల్ని చూసుకొని.. ఆయన్ను అమితంగా ఆరాధించే నేతగా కర్నూలు జిల్లా నందికొట్టూరు ఎమ్మెల్యే అర్థర్ కు మంచి పేరుంది. పోలీసు శాఖలో పని చేసిన ఆయన కు వైఎస్ అంటే వల్లమాలిన ప్రేమ. జగన్ కు అత్యంత విధేయుడిగా ఉండే ఆయన తీరు.. మిగిలిన రాజకీయ నేతలకు కాస్త భిన్నంగా ఉంటుందని చెప్పాలి.

అలాంటి ఆయన కు స్థానిక రాజకీయాలు వంటబట్టక పోగా.. కొందరు స్థానిక నేతలతో ఇరిటేట్ కావటం తోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు. దీనికి తగ్గట్లే తాజాగా చోటు చేసుకున్ పరిణామాలు ఈ వాదనకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యే కార్యక్రమాలకు హాజరువుతున్నారన్నది అధికార పార్టీకి చెందిన నేతలు.. కార్యకర్తల వాదన.

ఎమ్మెల్యే పాల్గొనే కార్యక్రమాల గురించి సమాచారం తమకు ఇస్తే వస్తామని వారు చెబుతుంటే.. అందుకు భిన్నంగా ఎమ్మెల్యే అర్థర్ మాత్రం కార్యక్రమాలకు నేరుగా వెళ్లటం స్థానిక నేతల కు నచ్చటం లేదు. తాజాగా నియోజక వర్గంలోని జూపాడు మండలం బన్నూరులో నిర్వహించిన కార్యక్రమానికి స్థానిక నేతలకు సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యే నేరుగా వచ్చేశారు. దీంతో.. వారుఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో ఆయన ఇరిటేట్ అయ్యారు.

తమకు చెప్పకుండా రావటం ఏమిటన్న వారి మాటతో నిరాశ చెందిన ఎమ్మెల్యే.. తానిక ఓట్లు అడుక్కోనని.. ఎమ్మెల్యే గా పోటీ చేయనని ప్రకటించారు. కార్యకర్తలు వచ్చినా.. రాకున్నా.. వాళ్ల కాళ్లను పట్టుకోనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇరిటేషన్ తోనే తప్పించి.. ఇంకేమీ లేదంటున్నారు. దొరికిందే సందు అన్న తరహాలో.. ఆయన వ్యాఖ్యల్నివక్రీకరిస్తూ సంచలనం గా మార్చటం గమనార్హం.


Tags:    

Similar News