కాఫీడే పై ఐటీ దాడులు...నేత‌ల్లో గుబులు

Update: 2017-09-21 13:08 GMT
ఆదాయ‌పు పన్ను శాఖ ఈ రోజు మెరుపు - సంచ‌ల‌న దాడులు చేసింది. ఇటీవ‌లి కాలంలో విప‌క్ష నేత‌లే ల‌క్ష్యంగా ఐటీ దాడుల‌కు  జ‌రుగుతున్నాయ‌నే ప్ర‌చారానికి భిన్నంగా..సాక్షాత్తు బీజేపీ నేత ఆస్తుల‌పై సోదాలు జ‌రిగాయి. దీంతోపాటుగా ఇటీవ‌లే అన‌ధికారికంగా మిత్ర‌ప‌క్షంగా మారిన అన్నాడీఎంకే పార్టీ నాయ‌కుడి ఆస్తుల‌పై సైతం దాడులు జ‌రిగాయి. ఈ రోజు జ‌రిగిన వ‌ర‌సు దాడుల్లో ప్ర‌ముఖ కాఫీ షాప్ అయిన‌...కేఫ్ కాఫీ డే కేంద్రాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించడం ఆస‌క్తిక‌రంగా మారింది. సుమారు 25 కాఫీ డే కేంద్రాలపై దాడులు నిర్వహించినట్లు తెలుస్తున్నది.

బెంగుళూరు - హసన్ - చిక్కమాగలూరు - చెన్నై - ముంబైల్లోని కాఫీడే కేంద్రాలపై దాడులు జరిగాయి. కాఫీడేతో పాటు సిద్ధార్థకు సంబంధం ఉన్న ఇతర వ్యాపార క్షేత్రాలపైన కూడా ఐటీ దాడులు చేసింది. బెంగుళూర్‌లోని విట్టల్ మాల్యా రోడ్‌లో కాఫీడే ప్రదాన కార్యాలయం ఉంది. కర్నాటక మాజీ సీఎం ఎస్‌ఎమ్ కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ ఈ సంస్థను స్థాపించారు. కాఫీడే ఓనర్ సిద్ధార్థ ఇటీవల బీజేపీలో చేరారు. కాఫీ డే ఓనర్ వద్ద అప్రకటిత ఆదాయం ఉందా అన్న కోణంలో అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

మ‌రోవైపు త‌మిళ‌నాడులో అధికార అన్నాడీఎంకే పార్టీ బహిష్కృత నేత టీటీవీ దినకరన్‌ వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఇంటిపైనా దాడులు జ‌రిగాయి. దిన‌క‌రన్ వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యే సెంథిల్‌ బాలాజీ నివాసంపై ఇన్‌కం టాక్స్‌ అధికారులు దాడులు చేశారు. అనర్హత వేటు పడిన సెంథిల్‌ తమిళనాడులోని కరూర్‌ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సెంథిల్‌కు చెందిన 10 భవనాల్లో ఐటి సోదాలు జరుగుతున్నాయి. పూర్తి వివ‌రాలు వెల‌వ‌డాల్సి ఉంది.
Tags:    

Similar News