ప్ర‌ధానిని డిసైడ్ చేయ‌డం స‌రే..ప్ర‌జ‌ల మాట వినిపిస్తోందా బాబు?

Update: 2018-03-30 05:49 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మ‌రోమారు భారీ ప్ర‌క‌ట‌న చేశారు. రాబోయే ఎన్నిక‌ల గురించి, అందులో టీడీపీ పాత్ర గురించి సంచ‌ల‌న కామెంట్ చేశారు. రానున్న ఎన్నికల్లో తాము నిర్ణయించిన వ్యక్తే దేశ ప్రధాని అవుతారని చంద్ర‌బాబు జోస్యం చెప్పారు. గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం రాత్రి జరిగిన టీడీపీి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. జాతీయ రాజకీయాల్లో టీడీపీ కీలక భూమిక పోషిస్తోందన్నారు. కాంగ్రెస్‌ యేతర పార్టీలన్నింటినీ ఒక తాటిపైకి తెచ్చిన ఘనత ఎన్‌ టీఆర్‌ కు దక్కిందన్నారు. దేశంలో 1984లో లోక్‌ సభలో టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించిందని చంద్ర‌బాబు అన్నారు.

ప్రత్యేక హోదా - ప్రత్యేక ప్యాకేజీపై కేంద్రం మోసం చేసిందని చంద్ర‌బాబు మండిప‌డ్డారు. ప్రత్యేక హోదాపై బీజేపీ నాయకులు అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. హోదాపై మోడీ ఇచ్చిన హామీని ఇప్పటికైనా నిలబెట్టుకోవాలన్నారు. బీజేపీ పలు రాష్ట్రాల్లో అధికారం కోసం ఎన్నో రాజకీయాలు చేసిందని కానీ ఈ రాష్ట్రంలో దాని ఆటలు సాగనివ్వబోమన్నారు. నిన్నటి వరకూ టీడీపీతో ఉన్న పవన్‌ కల్యాణ్‌ తెలిసీ తెలియకుండా ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. ప్రతిపక్ష నాయకుడు జగన్‌ - బీజేపీ పై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ - వైసీపీ లాలూచీ పడి టీడీపీని బలహీనపర్చాడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ మాట్లాడుతూ నిప్పులాంటి చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేయడం తగదన్నారు. బడ్జెట్‌ లో న్యాయం చేయమంటే అవినీతి ఆరోపణలు చేస్తారా అని ప్రశ్నించారు.

అయితే చంద్ర‌బాబు కామెంట్ల‌పై సోష‌ల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌త్యేక హోదా పేరు ఎత్తితేనే నేరం అన్న‌ట్లుగా సాక్షాత్తు చంద్ర‌బాబు కొద్దికాలం క్రితం వ‌ర‌కు వ్య‌వ‌హ‌రించార‌ని గుర్తు చేస్తున్నారు. మొద‌టినుంచి ప్ర‌త్యేక హోదా కోసం గ‌ళం వినిపిస్తున్న ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేశార‌ని ప్ర‌స్తావిస్తున్నారు. ఇప్పుడు చంద్ర‌బాబు త‌న రాజ‌కీయ వ్యూహాల్లో భాగంగా తిరిగి కేంద్రంపై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని అంటున్నారు. అదే స‌మ‌యంలో ఏపీలో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో సీఎం ఖ‌చ్చితంగా చంద్ర‌బాబు అవుతార‌నే గ్యారంటీయే లేద‌ని, టీడీపీకి గ‌త ఎన్నిక‌ల్లో ద‌క్కిన మెజార్టీపై కూడా సందేహాలున్నాయ‌ని పేర్కొంటూ...ఆ పార్టీ జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్ర తిప్ప‌డం ఎలా సాధ్య‌మ‌వుతుంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

Tags:    

Similar News