షర్మిల కేరాఫ్ తెలంగాణా... కాంగ్రెస్ లో విలీనం జాంతా నై !

Update: 2023-06-23 22:39 GMT
తెలంగాణా బిడ్డను నేను, తెలంగాణా ప్రజలతో నా బంధాన్ని ఎవరూ తెంచలేరు, వారిని నన్ను ఎవరూ దూరం చేయలేరు అంటున్నారు వైఎస్ షర్మిల. తన పార్టీ వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్లుగా వస్తున్న వార్తల పట్ల ఆమె ట్విట్టర్ వేదికగా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. నిరాధార ప్రచారం ఇదని మండిపడ్డారు.

ఇదంతా తెలంగాణా సమాజానికి తనను దూరం చేసే  కుట్ర అని కూడా అంటున్నారు. ఎవరో పుట్టిన ప్రచారానికి ఊహాగానాలకు షర్మిల సరైన జవాబు అన్నట్లుగా చెప్పారు. తన పార్టీ విలీనం అన్నది నమ్మరాదని కూడా ఆమె ప్రజలను కోరారు.

ఇదంతా ప్రజలతో తనకు అగాధం సృష్టించే చర్యలు తప్ప మరేమీ కావని ఆమె అంటున్నారు. పనిలేని పసలేని మాటలు ప్రచారాలు అంటూ ఆమె ఫైర్ అవుతున్నారు. తన వర్తమానమే కాదు భవిష్యత్తు కూడా తెలంగాణాతోనే ముడిపడి ఉందని ఆమె అంటున్నారు

అంతే కాదు తన తుది శ్వాస వరకూ తెలంగాణా కోసమే పోరాడుతాను తప్ప ఆగేది లేదని అన్నారు. ఇదిలా ఉంటే షర్మిల ఇంత ఘాటుగా ఎందుకు రియాక్ట్ అయ్యారంటే తెలంగాణా కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావు థాక్రే చేసిన ఒక ప్రకటన అని అంటున్నారు.

వైఎస్ షర్మిల కాంగ్రెస్ అధినాయకత్వంతో టచ్ లో ఉంటోందని ఆయన చేసిన ప్రకటనతో షర్న్మిల అర్జంటుగా ట్విట్టర్ ద్వారా రియాక్ట్ కావాల్సి వచ్చింది అని అంటున్నారు. అయితే షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందని ఇటీవల ఊహాగానాలు ఎక్కువగానే వినిపించాయి.

దానికి అనుగుణంగా ఆమె కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ని కలవడం తో పాటు ఆమె పార్టీని కూడా కలిపేసి ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అవుతారు అని ప్రచారం జరిగింది. అంతే కాదు ఆమెకు రాజ్యసభ సీటు ఇచ్చి ఏపీలోనే పూర్తిగా వినియోగించుకుంటారు అని కూడా అంటూ వచ్చారు.

అయితే ఏపీలో జగన్ సీఎం గా ఉన్నారు. షర్మిల అన్న మీద డైరెక్ట్ గా పోరాటం చేయడానికి ఇష్టపడరని అంటున్నారు. అంతే కాదు ఆమె తెలంగాణాలోనే తన రాజకీయం ఏంటో చూసుకోవాలని అనుకున్నారు. ఆమె తెలంగాణాలో ఎదగాలని చూస్తూంటే కాంగ్రెస్ పెద్దలు మాత్రం ఆమెను ఏపీలో సీఎం జగన్ మీద ప్రయోగించాలని చూడడంతోనే ఆమె కాంగ్రెస్ కి దగ్గర అవుతారని వస్తున్న వార్తలను ఖండించారు అని అంటున్నారు

అందుకే ఆమె కచ్చితంగా తాను తెలంగాణాలోనే ఉంటాను తుది దాకా అని చెప్పేశారు. దీంతో అన్నా చెల్లెళ్ళ సమరం, ఏపీలో వైఎస్సార్ వారసురాలిని ముందు పెట్టి రాజకీయ లాభం పొందాలన్న కాంగ్రెస్ ఆశలు అయితే నేరవేరవు అంటున్నారు. మరి వైఎస్సార్టీపీతో షర్మిల వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు పోటీ చేస్తారో చూడాల్సి ఉంది.

Similar News