మరో ఐఏఎస్ రాజీనామా..మోదీ పాలన ఎఫెక్టేనా?

Update: 2019-09-07 01:30 GMT
కేంద్రంలో వరుసగా రెండో సారి అధికార పగ్గాలు చేపట్టిన నరేంద్ర మోదీ... తనదైన శైలి సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. తొలి టెర్మ్ లో తీవ్ర కఠిన నిర్ణయాలు తీసుకున్నా... మొన్నటి ఎన్నికల్లో దేశ ప్రజలు మరోమారు మోదీకే పట్టం కట్టారు. ఈ క్రమంతో తన మిత్రుడు - బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను తన కేబినెట్ లో చేర్చుకుని ఏకంగా హోం శాఖను కట్టబెట్టిన మోదీ... రానున్న కాలంలో మరింత కఠినంగానే వ్యవహరించనున్నట్లుగా సంకేతాలు పంపారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ తరహా మోదీ నిర్ణయాలపై బ్రూరోక్రాట్లు తమదైన శైలి నిరసన తెలపడం ఇప్పుడిప్పుడే మొదలైనట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఓ ఐఏఎస్ ఆఫీసర్ తన పదవికి రాజీనామా చేయగా... ఇప్పుడు మరో ఐఏఎస్ అధికారి ఒకరు తన పదవికి రాజీనామా చేశారు. ఈ ఇద్దరు అధికారులు తమ రాజీనామాలకు ఒకే రకమైన కారణాలు చెప్పడం నిజంగానే ఆశ్చర్యం కలిగిస్తోంది.

కర్ణాటకకు చెందిన దక్షిణ కన్నడ జిల్లా కలెక్టర్ (అక్కడ డిప్యూటీ కమిషనర్ గా వ్యవహరిస్తారు) శశికాంత్ సెంథిల్ తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేసేశారు. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ పరిస్థితులపై కలత చెందిన కారణంగానే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా సెంథిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సెంథిల్ చేసిన వ్యాఖ్యలు పెను కలకలమే రేపుతున్నాయి. దేశ ప్రజాస్వామ్య పునాదులు తీవ్రంగా దెబ్బ తిన్నాయని - ఇలాంటి పరిస్థితుల్లో ఓ ఐఏఎస్ అధికారిగా విధులు నిర్వర్తించడం అనైతికంగా భావిస్తున్నానని సెంథిల్ పేర్కొన్నారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో దేశం తీవ్రమైన సవాళ్లను కూడా ఎదుర్కోబోతోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. విధుల నుంచి అర్ధాంతరంగా తప్పుకుంటున్నందుకు తనను ప్రజలు క్షమించాలని కూడా ఆయన కోరారు.

ఇదిలా ఉంటే... ఇప్పుడు సెంథిల్ రాజీనామా చేసినట్టుగానే ఇటీవలే ఓ ఐపీఎస్ అధికారి కూడా కేవలం ఇదే కారణాలను చూపుతూ తన పదవికి రాజీనామా చేశారు. దాద్రా నగర్ హవేలీలో ఐఏఎస్ అధికారిగా పనిచేస్తున్న కన్నన్ గోపినాథన్ తన పదవికి రాజీనామా చేశారు. నేాడు కన్నన్ తన రాజీనామాకు చెప్పిన కారణాలు... ఇప్పుడు సెంథిల్ చెబుతున్న కారణాలు దాదాపుగా ఒకటేనని చెప్పాలి. కేంద్రంలో మోదీ సర్కారు అనుసరిస్తున్న వ్యవహారం కారణంగానే వీరిద్దరూ తమ పదవులకు రాజీనామాలు చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మోదీ సర్కారు నియంతృత్వ వైఖరే వీరి రాజీనామాలకు కారణమన్న విశ్లేషణలు గట్టిగానే వినిపిస్తున్నాయి.

    

Tags:    

Similar News