రాపాకపై ఆ మాజీ ఐఏఎస్ అధికారిని దించుతున్న జ‌న‌సేన‌!?

Update: 2022-08-08 09:34 GMT
2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీకి ఒకే ఒక్క సీటు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. తూర్పుగోదావ‌రి జిల్లా రాజోలు నుంచి పోటీ చేసిన రాపాక వ‌ర‌ప్ర‌సాద‌రావు ఒక్క‌డే జ‌న‌సేన పార్టీ నుంచి గెలుపొందారు. అయితే ఆ కొద్ది కాలానికే ఆయ‌న వైఎస్సార్సీపీతో అంట కాగుతున్నారు. ఆ పార్టీ స‌మావేశాల్లోనూ, స‌భ‌ల్లోనూ, సీఎం జ‌గ‌న్ తూర్పుగోదావ‌రి జిల్లాకు వ‌చ్చిన‌ప్పుడు ఆయ‌న వెంట రాపాక హ‌ల్ చ‌ల్ చేశారు.

తాను త‌న సొంత‌బ‌లంతోనే గెలిచాన‌ని.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇమేజ్ వ‌ల్ల కాద‌ని రాపాక వ‌ర‌ప్ర‌సాద‌రావు చేసిన కామెంటు జ‌నసేన పార్టీ సైనికుల‌ను బాధించాయి. దీంతో వారు గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో రాజోలు నియోజ‌క‌వ‌ర్గంలో అత్య‌ధిక గ్రామాల్లో జ‌న‌సేన పార్టీ అభ్య‌ర్థుల్ని గెలిపించుకుని రాపాక‌కు సవాల్ విసిరారు. చివ‌ర‌కు రాపాక త‌న సొంత గ్రామంలోనూ ఆయ‌న నిల‌బెట్టిన అభ్య‌ర్థిని గెలిపించుకోలేక‌పోయారు.

మ‌రోవైపు రాజోలులో రాపాక వ‌ర‌ప్ర‌సాద‌రావు వైఎస్సార్సీపీలోకి రావ‌డాన్ని వ్య‌తిరేకిస్తూ గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న‌పై పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే బొంతు రాజేశ్వ‌ర‌రావుతోపాటు జిల్లా పార్టీ కార్య‌ద‌ర్శి, ఇత‌ర కీల‌క నేత‌లు వైఎస్సార్సీపీకి గుడ్ బై కొట్టేశారు. మ‌రోవైపు ఎస్సీ కార్పొరేష‌న్ చైర్మ‌న్ పెద‌పాటి అమ్మాజీ వ‌ర్గంతోనూ రాపాక‌కు విభేదాలున్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

అయితే వ‌చ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాజోలు నుంచి వైఎస్సార్సీపీ నుంచి రాపాక వ‌ర‌ప్ర‌సాద‌రావు పోటీ చేస్తార‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ రాజోలును గెలుచుకోవ‌డానికి జ‌న‌సేన పార్టీ కూడా గ‌ట్టి అభ్య‌ర్థిని రంగంలోకి దించుతోంద‌ని చెప్పుకుంటున్నారు. ఇటీవ‌ల మాజీ ఐఏఎస్ అధికారి దేవ వ‌ర‌ప్ర‌సాద్ జ‌న‌సేన పార్టీలో చేరిన సంగ‌తి తెలిసిందే.

ఆయ‌న ఏపీ ప్ర‌భుత్వంలో వివిధ విభాగాల్లో సెక్ర‌ట‌రీగా బాధ్య‌తలు నిర్వ‌హించారు. ఆయ‌న స్వ‌గ్రామం కూడా రాజోలు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని దిండి కావ‌డంతో ఈసారి జ‌న‌సేన నుంచి దేవ వ‌ర‌ప్ర‌సాద్ ను రాపాకపై జ‌న‌సేన ప్ర‌యోగిస్తోంద‌ని అంటున్నారు.

మ‌రికొద్ది రోజుల్లోనే ఈ మేర‌కు జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్.. దేవ వ‌ర‌ప్ర‌సాద్ ను రాజోలు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా ప్ర‌క‌టించ‌డంతోపాటు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థిగానూ అనౌన్సు చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.
Tags:    

Similar News