రద్దు వెనుక కసరత్తు ఎంతో బయటపెట్టారు

Update: 2016-11-18 04:48 GMT
పెద్దనోట్ల రద్దు వ్యవహారం దేశ వ్యాప్తంగా పలు సంచలనాలకు వేదికగా మారుతోంది. నిన్నటి వరకూ చేతిలో ఉన్న డబ్బును ఖర్చుచేసే విషయంలో వెనుకా ముందు లేకుండా ఉంటే సగటే జీవి.. తాజాగా మాత్రం ఖర్చుచేసే ప్రతి రూపాయిని ఆచితూచి ఆలోచించి మాత్రమే ఖర్చు చేస్తున్న పరిస్థితి. నోట్ల మార్పిడి మొదలు.. బ్యాంకు అకౌంట్లో ఉన్న మొత్తాన్ని విత్ డ్రా చేసుకునే వరకూ పరిమితులు భారీగా ఉన్న నేపథ్యంలో ‘ఖర్చు’ విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పక తప్పదు.

ఇదిలా ఉంటే.. నోట్ల రద్దు ఇష్యూలో కేంద్రం ముందస్తుగా సరైన కసరత్తు చేయకుండానే రద్దు నిర్ణయాన్ని హడావుడిగా ప్రకటించిందని.. ఇదే ఈ రోజు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు కారణమన్న భావన ఉంది. అయితే.. ఇలాంటి ఆరోపణలు నిజం లేదని.. రద్దు నిర్ణయం ప్రకటించటానికి ముందు భారీ కసరత్తు జరిగిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి.. జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్.. ఆడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ కె.పద్మనాభయ్య. తాజాగా రద్దు అంశంపై ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన అంశాల్ని చెప్పుకొచ్చారు. రద్దు నిర్ణయం వెనుక కేంద్రం చేసిన కసరత్తును ఆయన చెప్పుకొచ్చారు.

‘‘నోట్ల రద్దుపై పెద్ద కసరత్తు జరగకుండానే నిర్ణయం తీసుకుందన్న ఆరోపణల్లో నిజం లేదు. రహస్యంగా ఏదైనా చేయాలంటే ముందస్తు కసరత్తు చాలానే ఉంటుంది. ఎంత కట్టుదిట్టంగా వ్యవహరించినా రహస్య నిర్ణయాల్ని అమలుచేయటం చాలా కష్టం. రహస్యాన్ని ఎక్కువ కాలం దాచటం సాధ్యం కాదు. ఇక.. పెద్ద నోట్ల రద్దు వెనుక ఏడాది కసరత్తు ఉంది. గత ఏడాది రూ.1990 కోట్ల మేర రూ.వెయ్యి నోట్లను ముద్రించాలని నిర్ణయించింది. అయితే.. రూ.990కోట్లను మాత్రమే ముద్రించింది. ముద్రణ స్థాయిలోనే సగానికి సగం తగ్గింది’’

‘‘10 శాతం ఏటీఎంలలో రూ.100నోట్లు మాత్రమే నింపాలని రిజర్వ్ బ్యాంకు ఏడాది కిందటే స్పష్టం చేసింది. 40 శాతం గ్రామాలకు బ్యాంకు సౌకర్యం లేదు. ఈ అంశం పైనా.. ప్రత్యామ్నాయ చెల్లింపులపైనా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి ఉంది. ఇంత కసరత్తు జరిగిన తర్వాతే రద్దు నిర్ణయాన్ని వెల్లడించారు. రద్దుతో పెట్టుకున్న లక్ష్యం తప్పకుండా నెరవేరుస్తుంది. అయితే.. ప్రజలు పడుతున్న ఇబ్బందులతో పోల్చినప్పుడు ప్రయోజనాలు మాత్రం నెమ్మదిగానే కనిపిస్తాయి. నల్లధానికి మరో మూలాధారం పన్నులు ఎగగొట్టం కోసం ఎగుమతులు.. దిగుమతుల్లో తేడాలు చూపించటం. ఇలా సంపాదించిన డబ్బును ఇతర మార్గాల ద్వారా ఇతర దేశాల్లో భద్రపరుస్తారు. అక్కడ నుంచి తిరిగి షేర్ మార్కెట్లోకి తీసుకొస్తారు. పలు సందర్భాల్లో బినామీ భాగస్వామ్యం పేరుతో అసలు వ్యక్తులు బయటకు రాకుండా షేర్ మార్కెట్లోకి డబ్బును తీసుకొస్తారు. ఇలాంటివన్నీ ఇప్పుడు చెక్ పడినట్లే’’.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News