వన్డే నిబంధనలు మారాయి

Update: 2015-06-27 09:39 GMT
అసలు క్రికెట్‌ అంటేనే బ్యాట్స్‌మెన్‌ ఆట అని పేరుంది. ఐతే గత కొన్నేళ్లలో క్రికెట్‌ పూర్తిగా బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా మారిపోయింది. టీ20 క్రికెట్‌ ప్రవేశంతో బ్యాట్స్‌మెన్‌ జోరు బాగా ఎక్కువైంది. హిట్టింగ్‌ చేయనివాడు క్రికెటరే కాదు అనుకునే రోజులొచ్చేశాయి. ఒకప్పుడు నెమ్మదిగా ఆడిన ఆటగాళ్లు కూడా ఇప్పుడు వీరబాదుడు బాదేస్తున్నారు. రోజుకో కొత్త షాటు పుట్టుకొచ్చి బౌలర్ల పాలిట శాపంగా మారుతోంది. దీనికి తోడు ఆటను రంజుగా మార్చేందుకంటూ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా మార్చేసిన ఐసీసీ.. బౌలర్ల కష్టాల్ని మరింత పెంచింది. ఐతే రోజు రోజుకూ ఇలా బ్యాట్స్‌మెన్‌ ఆధిపత్యం పెరిగిపోతుండటంతో కొన్నాళ్లకు కొత్తగా బౌలింగ్‌లోకి రావడానికే ఆటగాళ్లు భయపడతారేమో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది మాజీ క్రికెటర్ల నుంచి. అందుకే వన్డేల్లో బౌలర్లకు అనుకూలంగా కొన్ని నిబంధనలు మార్చాలని నిర్ణయించింది ఐసీసీ. ఆ నిబంధనలేంటో చూద్దాం పదండి.

! వన్డేల్లో ఒకప్పుడు తొలి పది ఓవర్ల తర్వాత 30 గజాల వలయం అవతల ఐదుగురు ఫీల్డర్లుండేవారు. కానీ కొన్నేళ్ల కిందట నలుగురు ఫీల్డర్లే ఉండేలా నిబంధనలు మార్చారు. ఈ నిబంధన బౌలర్లకు శాపంగా మారింది. ముఖ్యంగా చివరి పది ఓవర్లలో ఈ నిబంధనల వల్ల భారీగా పరుగులు వచ్చేస్తున్నాయి. దీంతో ఇకపై చివరి పది ఓవర్లలో వలయం అవతల ఐదుగురు ఫీల్డర్లను పెట్టుకోవడానికి ఐసీసీ అనుమతించింది.

! 15-40 ఓవర్ల మధ్య ఎప్పుడైనా ఓ ఐదు ఓవర్ల పాటు బ్యాటింగ్‌ పవర్‌ ప్లే వాడుకునే అవకాశముంది. ఆ సమయంలో వలయం అవతల ముగ్గురే ఫీల్డర్లుంటారు. ఇప్పుడీ బ్యాటింగ్‌ పవర్‌ప్లే నిబంధనను తీసేశారు.

! తొలి పది ఓవర్లలో ఇద్దరు ఫీల్డర్లు కచ్చితంగా క్యాచింగ్‌ పొజిషన్లో ఉండాలన్న నిబంధనను కూడా రద్దు చేశారు.

! బౌలర్లకు అనుకూలంగా ఈ మూడు నిబంధనలు మార్చిన ఐసీసీ.. బ్యాట్స్‌మెన్‌ కోసం కొత్తగా ఓ నిబంధన చేర్చింది. ఇప్పటిదాకా పాపింగ్‌ క్రీజు నోబాల్‌కు మాత్రమే ఫ్రీహిట్‌ ఇచ్చేవాళ్లు. ఇకపై బ్యాట్స్‌మెన్‌కు వేసే నోబాల్‌కు కూడా ఫ్రీహిట్‌ ఇస్తారు.

Tags:    

Similar News