ఢిల్లీ ఫలితాల్లో 'సామాన్యుడు' చెలరేగితే..అన్ని అవే స్టోరీలు

Update: 2020-02-09 14:30 GMT
సీజన్ కు తగ్గట్లుగా కొత్త కూరగాయలు.. పండ్లు.. పంటలు ఎలా అయితే వస్తాయో.. కొన్ని రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నంతనే.. మీడియాలో కొన్ని కథనాల వరద కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితే చోటు చేసుకోనుందని చెప్పాలి. ఆసక్తిగా ఎదురుచూసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ పూర్తి అయ్యింది. ఆ వెంటనే ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. ఐదారు సీట్లు అటు ఇటుగా పాలక ఆమ్ ఆద్మీ పార్టీకే ఢిల్లీ రాష్ట్ర ప్రజలు మరోసారి అధికారాన్ని కట్టబెట్టినట్లుగా ఫలితాలు వెల్లడవుతున్నాయి.

ఎన్నికల ఫలితాలు కూడా అదే విషయాన్ని చెబుతాయని నమ్మకంగా చెబుతున్నారు. గతంతో పోలిస్తే.. బీజేపీకి కొన్ని సీట్లు పెరగొచ్చే కానీ.. ఆమ్ ఆద్మీ పార్టీని నిలువరించే సీన్ కమలనాథులకు లేదన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. అంచనాలకు తగ్గట్లే సామాన్యుడి పార్టీ విజయం సాధిస్తే ఏం జరుగుతుంది? అన్న ప్రశ్నకు సమాధానం ఆసక్తికరంగా మారింది.

ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ పార్టీ విజయం సాధించిన వెంటనే.. మోడీషాల పని అయిపోయిందని.. ఇటీవల కాలంలో బీజేపీ ప్రభ అంతకంతకూ తగ్గిపోతుందని.. ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారాన్ని కోల్పోవటాన్ని చూపించటం.. అందుకు తగ్గ గ్రాఫులు.. గణాంకాలతో రెండు.. మూడు రోజులు మోతెక్కించటం ఖాయమని చెబుతున్నారు. అలా వచ్చే కథనాల్లో నిజం లేదా? అంటే.. అక్కడే ఉంది అసలు రాజకీయం.

ముందే చెప్పినట్లు సీజన్ కు తగ్గట్లు మార్కెట్లోకి వచ్చే ఫ్రూట్స్ మాదిరే.. ఎన్నికల ఫలితాలకు అనుగుణంగా కొన్ని కథనాల్ని అలా తయారు చేసి జనం మీదకు వదిలేస్తుంటారని చెప్పాలి. మోడీని రాజకీయంగా దెబ్బ తీయాలని తపించే రాజకీయ పక్షాలకు.. వారి అనుకూల మీడియాకు ఇంతకు మించిన అవకాశం ఏముంటుంది చెప్పండి. అందుకే వారు మరింత యాక్టివ్ అయిపోతారు. మరి.. జనం మాటేమిటంటారా? మీడియాకు మించిన క్లారిటీ దేశ ప్రజలకు ఉంది. ఎప్పుడు.. ఏ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలన్న విషయంలో వారెప్పుడు స్పష్టంగానే ఉన్నారు. అంతేనా.. కొన్నిసార్లు బ్యాలెన్స్ చేయాల్సిన అవసరాన్ని గుర్తించి మరి.. తమ తీర్పును ఇచ్చే ధోరణి చూస్తే.. దేశ ప్రజలు మరీ అంత అమాయకులు కాదన్నది మర్చిపోకూడదు.
Tags:    

Similar News