కిమ్ సిగరెట్ మానేస్తే కానీ ఆ దేశంలో ఆ మార్పు రాదా

Update: 2020-11-15 23:30 GMT
డిజిటల్ విప్లవంతో ప్రపంచమంతా స్వేచ్ఛా వాయువులు పీలుస్తుంటే..కొన్ని దేశాల్లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి. ఉత్తర కొరియా లాంటి దేశంలో ప్రజలకుండే స్వేచ్ఛ ఎంతో పరిమితం. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ రాజ్యంలో ప్రజల మీద ఉండే ఆంక్షలు ఎంతన్నది తెలిసిందే. నియంత్రణ మధ్యన వారి జీవితం ఎలా ఉంటుందో ఊహించటానికే వీల్లేని పరిస్థితి. బయట ప్రపంచం మీద అవగాహన లేకపోవటం.. మిగిలిన దేశాల్లోని ప్రజలకుండే స్వేచ్ఛ గురించి చాలామందికి తెలీదని చెబుతారు. వారి లోకమంతా తమ అధ్యక్షుడు కిమ్ మీదనే. అపరిమితమైన అధికారాలున్న ఆయన మీద అపరిమితమైన అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు.

ఆయన్ను అనుకరించేందుకు విపరీతంగా ఇష్టపడుతుంటారు. కిమ్ చేతిలో విలాసంగా తిరిగే సిగరెట్ ఆ దేశ మగాళ్లను పొగరాయుళ్లుగా మార్చేస్తోందట. ధూమపానానికి వ్యతిరేకంగా అనేక ప్రచారాలు చేపట్టినా.. అక్కడి పురుషుల్లో సగం మంది సిగరెట్ కాలుస్తుంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అక్కడి మహిళలు పొగతాగే అలవాటు అస్సలు ఉండదంటారు. ప్రస్తుతం ఉత్తర కొరియాలో బహిరంగ ప్రదేశాల్లో ధూమపానాన్ని నిషేధిస్తూ ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ప్రజలకు మరింత నాగరికమైన.. పరిశుభ్రమైన వాతావరణం అందుబాటులో ఉండేందుకు వీలుగా కొన్ని నిబంధనల్ని ప్రవేశ పెట్టారు. అయితే.. అధ్యక్షుల వారి చేతిలో తిరిగే సిగరెట్ కాలుతున్నంత కాలం.. ప్రజలు ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోకుండా ఉంటారా? అన్నది ప్రశ్న. ధూమపానాన్ని కిమ్ తనకు తాను ఆపేస్తే తప్పించి.. ఉత్తర కొరియాలో మార్పు రాదంటున్నారు.

మరోవైపు కిమ్ సర్కారు తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం.. సిగరెట్ల ఉత్పత్తి.. అమ్మకాలపై చట్టపరమైన నియంత్రణను తీసుకొచ్చారు. రాజకీయ చర్చలు జరిపే ప్రదేశాల్లో.. నాటకాలు.. సినిమా థియేటర్లు.. విద్యాసంస్థలు.. ప్రభుత్వ ఆసుపత్రులు.. ప్రభుత్వ రవాణా సౌకర్యాల్ని వినియోగించే ప్రదేశాల్లో సిగరెట్ తాగకూడదు. ఒకవేళ.. బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్లు కాలిస్తే జరిమానా ఉంటుందని చెబుతున్నారు. ఓవైపు కఠిన చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిన అధ్యక్షుల వారు.. తాను మాత్రం తరచూ సిగరెట్లతో దర్శనమిస్తుంటారు.
ట్రంప్ తో భేటీకి వియత్నాంకు రైల్లో ప్రయాణించిన సమయంలో సిగరెట్ కాలుస్తూ కెమేరా కంటికి చిక్కటం.. ఆయనకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆయన సోదరి యాష్ ట్రే పట్టుకొని ఉంటారని చెబుతారు. సిగరెట్ అలవాటు మానుకోవాలని కిమ్ సతీమణి.. సోదరి తరచూ చెబుతుంటారని.. ఆయన పట్టించుకోరంటారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఉత్తరకొరియాలోని మహిళలు ఎవరూ సిగరెట్ కాల్చరని చెబుతారు.

ధూమపానం చేసే మహిళల్ని చిన్నచూపు చూడటంతో వారు సిగరెట్ల జోలికి అసలే వెళ్లరని చెబుతారు. కానీ.. పురుషుల్లో మాత్రం ఈ అలవాటు చాలా ఎక్కువగా ఉండటం గమనార్హం.




Tags:    

Similar News