వితంతువులు పెళ్లి చేసుకుంటే త‌ప్పేంటి?

Update: 2018-06-23 13:17 GMT
భార‌త దేశం సంస్కృతీ సంప్ర‌దాయాల‌కు పెట్టింది పేరు. మ‌న ఆచార వ్య‌వ‌హారాలు, క‌ట్టుబాట్ల‌ను చూసి విదేశీయులు కూడ ఎంతో స్ఫూర్తి పొందుతుంటారు. అయితే, వితంతువులు వివాహాలు చేసుకోవ‌డం ప‌ట్ల మాత్రం భార‌తీయ స‌మాజంలో ఇప్ప‌టికీ కొంతమంది అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తుంటారు. భార్య మ‌ర‌ణించిన త‌ర్వాత పురుషుడు రెండో పెళ్లి చేసుకోవ‌డంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌ని స‌మాజం.... మ‌హిళ మ‌రో పెళ్లి చేసుకున్న‌పుడు మాత్రం వేలెత్తి  చూపుతుంటుంది. ఈ నేప‌థ్యంలోనే భార‌తీయ స‌మాజంలో ఆ త‌ర‌హా ఆలోచ‌నా విధానంలో మార్పు రావాల‌ని ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్యనాయుడు పిలుపునిచ్చారు. శ‌నివారం నాడు జ‌రిగిన అంతర్జాతీయ వితంతువు దినోత్స‌వం సంద‌ర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భ‌వ‌న్ లో లూంబా ఫౌండేష‌న్ ఏర్పాటు చేసిన కార్య‌క్ర్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న వితంతువు వివాహాల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో వెంక‌య్య‌తోపాటు కేంద్ర న్యాయ శాఖా మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ కూడా పాల్గొన్నారు.

స‌మాజంలో వితంతువుల ప‌ట్ల ఉన్న ధోర‌ణిలో మార్పు రావాల‌ని వెంక‌య్య నాయుడు అన్నారు. భార్య చ‌నిపోయిన త‌ర్వాత పురుషుడు మ‌రో వివాహం చేసుకుంటున్నారని....అదే త‌ర‌హాలో భ‌ర్త చ‌నిపోయిన మ‌హిళ‌లు ఎందుకు మ‌రో పెళ్లి చేసుకోకూడ‌ద‌ని వెంక‌య్య ప్ర‌శ్నించారు. భాగ‌స్వామి చ‌నిపోయిన త‌ర్వాత ఒంట‌రి జీవితం గ‌డ‌ప‌డం ఎవ‌రికైనా ఇబ్బందేనని, అయితే, మ‌హిళ‌ల‌కు ఆ ఇబ్బంది మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంద‌ని వెంక‌య్య అభిప్రాయ‌ప‌డ్డారు. స‌మాజంలో మార్పు రాక‌పోతే వితంతువుల స‌మ‌స్యల‌కు  ప‌రిష్కారం ల‌భించ‌ద‌ని ర‌వి శంక‌ర్ అభిప్రాయ‌ప‌డ్డారు. జాతీయ మ‌హిళా క‌మిష‌న్ త‌రహాలోనే జాతీయ వితంతువు క‌మిష‌న్ కూడా ఏర్పాటు చేయాల‌ని లూంబా ఫౌండేష‌న్ ప్ర‌తినిధి లూంబా.....ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు. దేశంలో వితంతువుల ప‌రిస్థితులును మెరుగుప‌రిచేందుకు ప్ర‌భుత్వం ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.
Tags:    

Similar News