సీఎం స్టేజ్ మీద ఉంటే.. ప్రత్యర్థి పార్టీ చోటా నేతను రానివ్వటమా?

Update: 2022-09-10 04:23 GMT
తెలంగాణ పోలీసింగ్ గురించి చాలా గొప్పలు చెబుతుంటారు. అలాంటి పోలీసింగ్ కు మచ్చ పడేలా చోటు చేసుకున్న తాజా ఉదంతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారటం ఖాయమంటున్నారు. ఇప్పటికి ఇప్పుడే కాకున్నా.. తర్వాతి రోజుల్లో దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుందన్న మాట వినిపిస్తోంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వేరే రాష్ట్రానికి వచ్చినప్పుడు.. ఆయన భద్రతను చూసుకోవాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర పోలీసుల మీద ఉంటుంది.

అందులోనూ అధికార టీఆర్ఎస్ కు.. విపక్ష బీజేపీకి మధ్య రాజకీయ రచ్చనడుస్తున్న వేళ.. కమలం పార్టీకి చెందిన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన భద్రత ఎంత పక్కాగా ఉండాలి? కానీ.. అదేమీ లేకుండా ఒక ఛోటానేత సీఎం ఉన్న స్టేజ్ మీదకు రావటం దేనికి నిదర్శనం? అని ప్రశ్నిస్తున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వేదిక మీద ఉన్న వేళ.. ప్రత్యర్థి పార్టీకి చెందిన ఛోటానేతను అనుమతించే సవాలే లేదంటున్నారు. కానీ.. అందుకు భిన్నంగా చోటు చేసుకున్న ఈ పరిణామం భద్రతా లోపాల్ని ఎత్తి చూపేలా ఉందన్న మాట వినిపిస్తోంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇప్పుడీ ఉదంతంలో నంద కిశోర్ ను హీరోగా అభివర్ణిస్తూ కొందరు టీఆర్ఎస్ అతిగాళ్లు వ్యవహరించే వైఖరి పార్టీకి నష్టం వాటిల్లేలా ప్రమాదం ఉందంటున్నారు. భద్రతా పరమైన తప్పులు జరిగినప్పుడు దానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని..దానికి సమాధానం చెప్పాల్సిందేనని చెబుతున్నారు. ఏమైనా ముఖ్యమంత్రి వేదిక మీద ఉన్నప్పుడు.. ఎవరిని అనుమతించరు. అంతేకాదు.. వారిని కిలోమీటర్ల దూరంలోనే ఆపేస్తారు.

కానీ.. అందుకు భిన్నంగా స్టేజ్ వద్దకు రావటమేకాదు.. ఏకంగా సదరు రాష్ట్ర ముఖ్యమంత్రి పక్కకు వచ్చి.. మైకు ఎలా లాగేస్తారు? అని ప్రశ్నిస్తున్నారు. నంద కిశోర్ విషయానికి వస్తే.. అతడి మెడలో గులాబీ కండువా వేసుకొని ఉన్నారు. అంటే.. గుర్తింపునకు ఏ మాత్రం ఇబ్బంది లేదు. అయినప్పటికీ ఆయన్ను అనుమతించారంటే.. కచ్ఛితంగా అది భద్రతా లోపం కిందనే పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News