వారికి పాజిటివ్ వస్తే మాత్రం.. వైద్యం వేరుగా ఉంటుందట

Update: 2020-06-03 23:30 GMT
ప్రపంచాన్ని వణికిస్తున్న మాయదారి రోగం అంతకంతకూ విస్తరిస్తున్న విషయం తెలిసిందే. మొదట్లో ఒకట్రెండు కేసులకే బెంబెలెత్తిపోయే పరిస్థితి నుంచి ఇప్పుడు ఒకే రోజులో వంద కేసులు నమోదయ్యాయంటే తప్పించి పెద్దగా పట్టించుకోని పరిస్థితి. ఇంతకాలం బ్యానర్ వార్తగా ఉన్న మాయదారి రోగం.. ఇప్పుడు ప్రాధాన్యత తగ్గుతోంది. కావాలంటే.. గడిచిన మూడు.. నాలుగు రోజులుగా వస్తున్న వార్తా పత్రికల్ని చూస్తే.. ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. మొదట్లో ఎవరికైనా పాజిటివ్ వస్తే.. వెంటనే ఆ వ్యక్తితో పాటు.. పాజిటివ్ వచ్చిన వ్యక్తికి ఎవరెవరితో కాంటాక్టు ఉందన్న విషయాన్ని లోతుగా ఆరా తీసి.. వారిని పరీక్షలు జరిపేవారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తికి సన్నిహితంగా ఉంటే.. క్వారంటైన్ కు పంపేవారు. సదరు వ్యక్తి ఉండే బజారు మొత్తాన్ని కంటైన్మెంట్ జోన్ కిందకు తీసుకెళ్లేవారు.

ఇప్పుడు అలాంటివన్నీ మారిపోతున్నాయి. పెరుగుతున్నకేసులకు తగ్గట్లే.. తీసుకునే చర్యల్లోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఎవరికైనా పాజిటివ్ అని తేలితే.. సదరు వ్యక్తిని మాత్రమే ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఒకవేళ పాజిటివ్ అయినా.. లక్షణాలు పెద్దగా కనిపించకపోతే.. ఇంట్లోనే క్వారంటైన్ కావాలని సూచిస్తున్నారు. అంతేకాదు.. కంటైన్మెంట్ జోన్ల నిర్వచనాన్ని మార్చేశారు కూడా. గతంలో బజారు మొత్తాన్ని కట్టడి చేసిన దానికి బదులుగా.. ఇప్పుడు పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇంటిని మాత్రమే కంటైన్మోంట్ జోన్ గా గుర్తిస్తున్నారు.

మరోవైపు టెస్టుల విషయంలోనూ కొత్త మార్పులు వచ్చేశాయి. రోగ లక్షణాలు కనిపిస్తే తప్పించి టెస్టులు చేయని పరిస్థితి. అంతేకాదు.. పాజిటివ్ వచ్చిన కుటుంబ సభ్యుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించకుంటే వదిలేస్తున్నారు తప్పించి.. టెస్టులు చేయటం లేదు. ఇలా మార్పుల మీద మార్పులు చేస్తున్న వేళ.. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఆసక్తికర ప్రకటన చేశారు.

క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారికి పాజిటివ్ గా తేలితే.. వారిని అందరి పేషెంట్లతో ట్రీట్ మెంట్ ఇవ్వటం ఉండదన్నారు. ఇప్పటివరకూ అందరితో కలిపి ట్రీట్ మెంట్ ఇచ్చే దానికి బదులుగా.. ఇప్పటి నుంచి వారిని వేరే వార్డులో ఉంచి చికిత్స చేస్తామని ప్రకటించారు. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రోగులకు ఇస్తున్న చికిత్స గురించి ఆరా తీసిన ఆయన.. ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించారు.

ఇకపై అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ పైపులైన్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఎవరూ సెలవులు పెట్టకూడదని చెప్పటం.. అందరూ విధులకు హాజరయ్యేలా చూడాలని అధికారుల్ని ఆదేశించటం చూస్తే.. రానున్న రోజుల్లో మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News