అదే జరిగితే ఇన్ కం ట్యాక్స్ ఎగ్గొట్టం వీజీ కాదు

Update: 2016-06-21 10:07 GMT
దేశంలో 130 కోట్లకు పైచిలుకు జనాభా ఉంటే అందులో ఆదాయపన్ను కట్టే వారి సంఖ్య 20 కోట్ల కంటే తక్కువే. అంటే.. దేశంలో ఉన్న జనాభాలో పన్ను కట్టే వారి సంఖ్య 15 శాతం మాత్రమే. గ్రామం నుంచి మహానగరం వరకు ఎవరికి వారు.. తమ చుట్టూ ఉన్న వారిని చూసినప్పుడు.. ఇన్ కం ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టే వారిని ఎంతోమందిని చూస్తుంటాం. ఇలాంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు ఎందుకు తీసుకోరని చాలామంది ప్రశ్నిస్తారు. నిజానికి భారతదేశం లాంటి దేశంలో అందరూ పన్ను కడితే.. పన్ను పోటును భారీగా తగ్గించే వీలు ఉంటుంది.

నిజానికి ప్రజలతో పాటు.. ప్రభుత్వాలు సైతం ఇన్ కం ట్యాక్స్ విషయంలో విప్లవాత్మక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతుంటారు. ఎందుకంటే.. నిజాయితీతో పన్ను కట్టే వారి మీదనే భారం మొత్తం పడుతుందని.. అలా కాకుండా అందరూ పన్ను చట్రంలోకి వచ్చేలా చేయగలిగితే.. పన్ను భారం భారీగా తగ్గే వీలుందన్న అభిప్రాయం ఉంది. ఇన్నాళ్లకు ఇలాంటి వాదనలు కేంద్రం చెవికి ఎక్కాయో లేక ఐటీ శాఖ బుర్రలోకి వెళ్లిందో కానీ.. ఇన్ కం ట్యాక్స్ ఎగ్గొట్టకుండా ఉండేలా సంచలన నిర్ణయాలు తీసుకుంది.

తాజాగా ఆ శాఖ తీసుకుంటున్న నిర్ణయాలు అమల్లోకి వస్తే.. దేశంలో ఇన్ కం ట్యాక్స్ ను ఎగ్గొట్టటం అంత సులువు కాకపోవచ్చన్న మాట వినిపిస్తోంది. ఇంతకీ.. ఐటీ శాఖ తీసుకోవాలనుకుంటున్న విప్లవాత్మక చర్యల విషయానికి వస్తే.. ఇన్ కం ట్యాక్స్ చెల్లించకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయటంతో పాటు.. ఎవరైనా ట్యాక్స్ ఎగ్గొడితే వారికి ఇబ్బందుల మీద ఇబ్బందులు ఎదురయ్యేలా చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఏడాది (ఆర్థిక సంవత్సరం) నుంచే ఇలాంటి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

పన్ను ఎగవేతదారుల విషయంలో ఐటీ శాఖ తీసుకోవాలనుకుంటున్న చర్యలు చూస్తే..

= గ్యాస్ సబ్సిడీలు రద్దు చేయటం

= బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు కాకుండా చేయటం

= ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగ్గొట్టే వారి పాన్ నెంబర్ ను బ్లాక్ చేస్తారు

= బ్లాక్ చేసిన పాన్ కార్డు వివరాల్ని రిజిష్ట్రార్ ఆఫ్ ప్రాపర్టీస్ కు పంపుతారు.

= అదే కానీ జరిగితే ఇలాంటి వారు ఆస్తుల అమ్మకాలు.. కొనుగోళ్లకు సాధ్యం కాదు

= అంతేకాదు.. భారీగా పన్ను ఎగవేత వేసే వారి సమాచారాన్ని ‘‘నేమ్ అండ్ షేమ్’’ గా పేర్కొంటూ మీడియాకు ఆ పేర్లను విడుదల చేయటం
Tags:    

Similar News