కరోనా సైరన్ మోగుతోందా? 145 రోజుల తర్వాత రోజులో 20వేల కేసులు

Update: 2022-07-14 08:59 GMT
ప్రపంచాన్ని వణికించి.. లక్షలాది మందిని పొట్టనబెట్టుకొని కోట్లాది మందికి కంటి నిండా కునుకు లేకుండా చేయటంతో పాటు.. ప్రపంచ గతిని మార్చేసిన ఘనత.. కంటికి కనిపించని కరోనా వైరస్ సొంతంగా చెప్పక తప్పదు.

కరోనా వైరస్ ఎంట్రీతో అప్పటివరకు ఉన్న ప్రపంచానికి సంబంధం లేని ఎన్నో అంశాలు చోటు చేసుకోవటం మొదలైంది. దశల వారీగా.. మధ్య మధ్యలో కాస్తంత విశ్రాంతిని ఇస్తూ.. రెట్టించిన బలంగా విరుచుకుపడుతున్న కరోనా.. ఇప్పుడు మరోసారి మరో ఊపు ఊపేందుకు సిద్ధమవుతుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

ఇప్పటికే మూడు వేవ్ లతో ముచ్చమటలు పోసేలా చేసిన కరోనా.. నాలుగో వేవ్ కు సంబంధించిన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటుందా? అన్న అనుమానం కలిగేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నుంచి దేశ వ్యాప్తంగా రోజులో 20 వేల కంటే తక్కువ కేసులే నమోదు కావటం తెలిసిందే.

అందుకు భిన్నంగా తాజాగా ఒక్కరోజులో 20 వేల కేసులకు పైనే నమోదైన వైనం చోటు చేసుకుంది. 145 రోజుల తర్వాత కరోనా కేసులు 20వేల మార్కును దాటిన వైనం కొత్త కలవరానికి కారణమవుతోంది.

ఒకపక్క నాలుగో వేవ్ కు సంబంధించిన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నప్పటికీ.. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మాత్రం అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. తాజాగా పాజిటివ్ రేట్ 5.1శాతంగా నమోదయ్యాయి. ఇప్పటివరకు 4.36 కోట్ల మంది మహమ్మారి బారిన పడినట్లుగా చెబుతున్నారు.

ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న కేసులు దేశ వ్యాప్తంగా 1.36 లక్షలు ఉన్నాయి. రివకరీ రేటు 98.49 శాతంగా ఉంది. 24 గంటల వ్యవధిలో 16,482 మంది కరోనా బారి నుంచి కోలుకుంటే.. అదే సమయంలో 20 వేల మంది కొత్తగా ఈ వైరస్ బారిన పడటం గమనార్హం. ఏమైనా.. సీజనల్ మార్పులు.. మరోవైపు చల్లదనానికి వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందన్న మాట వినిపిస్తున్న వేళలో.. కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Tags:    

Similar News