పండుగ రోజు పాక్‌ కు భార‌త్ షాక్‌

Update: 2016-10-31 03:36 GMT
దేశమంతా దీపావళి సంబురాల్లో మునిగిన వేళ భార‌త హాకీ జ‌ట్టు మ‌రో శుభవార్త‌ను అందించింది. ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా మలేషియాలో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌ లో భారత్‌ హకీ జట్టు చేతిలో పాకిస్థాన్ టీం ప‌రాజ‌యం పాలైంది. 3-2 తేడాతో పాకిస్థాన్‌ ను మట్టికరిపించి భారత్‌ విజేతగా నిలిచింది. త‌ద్వారా దీపావ‌ళి వెలుగులు మ‌రింత ప్ర‌కాశవంతంగా మారేలా భార‌త హాకీ టీం చేసింది.

పాకిస్తాన్‌-భార‌త్‌ ల మ‌ధ్య జ‌రిగిన ఫైనల్‌ మ్యాచ్ దీపావ‌ళి నేప‌థ్యంలో కావ‌డంతో మొద‌టి నుంచి ఉత్కంఠ రేగింది. భార‌త్ ఆట‌గాడు రూపిందర్‌ పాల్‌ సింగ్ మొద‌టి గోల్ చేశారు. అనంత‌రం మ‌న దేశానికి చెందిన మ‌రో ఆట‌గాడు యూసఫ్‌ కూడా గోల్‌ కొట్టి భారత్‌ ను 2-0తో ఆధిక్యంలో నిలిపి మొద‌ట్లోనే పాకిస్తాన్‌ పై మ‌న ఆదిప‌త్యాన్ని చాటుకున్నారు. అయితే త‌ర్వాతి మూడు నిమిషాల వ్యవధిలోనే పాక్ క్రీడాకారుడు ఒక‌రు గోల్ కొట్టడంలో స్కోర్ 1-2కి చేరింది. అనంత‌రం మ‌రో గోల్‌ ను సైతం పాక్ ఆట‌గాడు చేయ‌డంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. మ్యాచ్ ముగుస్తున్న స‌మయానికి భార‌త ఆట‌గాడు నికిన్ తిమ్మ‌య్య గోల్ చేయ‌డంతో 3-2గా భార‌త్ టాప్‌ లో నిలిచింది. ఈ క్ర‌మంలో పాక్ ఆట‌గాళ్లు గోల్ చేసేందుకు ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ ఫలితం ద‌క్క‌క‌పోవ‌డంతో...భార‌త్ ఇటు మ్యాచ్‌ ను - అటు ట్రోఫీని సైతం గెలుచుకుంది. ఈ విజ‌యం ప‌ట్ల రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ - దేశ‌ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. మ‌న క్రీడాకారుల‌ను ప్ర‌శంసించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News