ఈ దెబ్బ‌తో చైనా దిమ్మ‌తిరిగిపోయి ఉంటుంది

Update: 2017-07-07 07:30 GMT
ప‌క్క‌లో బ‌ల్లెంలాగా మారిపోవ‌డ‌మే కాకుండా హెచ్చ‌రికలు - ఒత్తిళ్లు - బెదిరింపులు చేస్తున్న చైనా విష‌యంలో భార‌త్ ఘాటుగా స్పందించింది. వెంట‌నే త‌మ బ‌ల‌గాల‌ను వెన‌క్కి రప్పించాలని లేదంటే సైనిక చ‌ర్య‌కు దిగుతామ‌ని కూడా చైనా హెచ్చరించినా.. భార‌త్ మాత్రం వెనుక‌డుగు వేయ‌డం లేదు. సిక్కిం - భూటాన్‌ ల విష‌యంలో తాము పున‌రాలోచ‌న చేయాల్సి వస్తుంద‌ని కూడా చైనా వార్నింగ్ ఇచ్చింది. అయిన‌ప్ప‌టికీ చైనా బెదిరింపుల‌కు లొంగ‌కుండా డోక్‌ లామ్ ప్రాంతంలో బ‌ల‌గాల‌ను వెన‌క్కి పిలిచే ఆలోచ‌న కూడా చేయ‌డం లేదు.

బెంగాల్‌ - అస్సాం రోడ్ లింక్‌ కు కేవ‌లం 30 కిలోమీట‌ర్ల దూరంలో వివాదాస్ప‌ద ప్రాంతంలో చైనా రోడ్డు నిర్మాణం చేప‌ట్ట‌డాన్ని భార‌త్ తీవ్రంగా వ్య‌తిరేకిస్తోంది. అంతేకాదు ఈ రోడ్డుకు స‌మీపంలోనే జాల్ధాకా న‌దిపై ఓ హైడ్రో ఎల‌క్ట్రిక్ ప్రాజెక్ట్ కూడా ఉంది. భూటాన్ స‌రిహ‌ద్దుకు ద‌గ్గ‌ర‌గా ఉన్న ఈ ప్రాజెక్టే.. సిక్కింలోకి ప్ర‌వేశించ‌డానికి బ్రిడ్జ్‌ లాగా వాడుతున్నారు. ఒక‌వేళ చైనా ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేస్తే.. ఈ బ్రిడ్జ్ ద్వారా వాళ్ల బ‌ల‌గాలు ఏకంగా భార‌త భూభాగంలోకే వ‌చ్చే ప్ర‌మాదం ఉంది. అందుకే మూడు వారాలుగా భార‌త బ‌ల‌గాలు అక్క‌డే తిష్ట వేసి.. రోడ్డు ప‌నులు సాగ‌కుండా అడ్డుకుంటున్నాయి. ఇంత ప్రాధాన్యం ఉన్న ప్రాంతం కావ‌డంతో అస్స‌లు వెన‌క్కి త‌గ్గ‌కూడ‌ద‌ని భార‌త్ భావిస్తోంది. అటు భూటాన్ కూడా ఈ రోడ్డు నిర్మాణాన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తోంది.

ఇదిలాఉండ‌గా...భారత్-చైనా సైన్యాల మధ్య సిక్కిం సెక్టార్‌ లో నెలకొన్న ప్రతిష్ఠంభనను దౌత్య మార్గంలో పరిష్కరించుకోవచ్చని భారత్ పేర్కొంది. ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలను తొలగించేందుకు చైనా సైనికులు భూటాన్ భూభాగాన్ని వదిలి వెళ్లాలని సూచించింది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి సుభాష్ భామ్రే ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ``ఈ సమస్యను దౌత్య స్థాయిలోనే పరిష్కరించుకోవచ్చు. చైనా సైన్యాలు ఇంతకుముందు ఎక్కడ ఉన్నాయో అక్కడికి తిరిగి వెళ్లాలి. భూటాన్ భూభాగంలోకి చైనా చొచ్చుకొస్తోంది. వారింక ఎంతమాత్రం ముందుకు రాకూడదు. ఇదే మా వైఖరి. చైనా సైన్యాలు తమ భూభాగంలోకి వస్తున్నాయి`` అని భూటాన్ రాజు బుధవారం ఒక ప్రకటన చేశారు. ఈ ఉద్రిక్తతలను దౌత్య స్థాయిలోనే పరిష్కరించుకోవచ్చు. చర్చించుకుంటే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి అని అన్నారు. పంచశీల ఒప్పంద సూత్రాలను భారత్ కాలరాస్తున్నదంటూ చైనా అధికార మీడియా ఆరోపించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి స్పందించారు.
Tags:    

Similar News